అరుణాచలం సాక్షిగా అపచారం.. ఆలయం ప్రాంగణంలో మాంసాహారం భుజించిన జంట!
- ఆలయ ఐదో ప్రాకారంలో దంపతులు ఆహారం సేవనం
- అది మాంసాహారమంటూ భక్తుల ఆరోపణ, ఫిర్యాదు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయశాఖ అధికారులు
- దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
భక్తుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దంపతులను పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ.. తాము కుస్కా (ప్లెయిన్ బిర్యానీ) ఆర్డర్ చేశామని, అయితే అందులో పొరపాటున చికెన్ ముక్క వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, ఆలయంలోకి మాంసాహారం తీసుకురావడం, దాన్ని తినడం వల్ల ఆలయం మైలపడిందని భావించిన అర్చకులు, అధికారులు బుధవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గర్భగుడి ముందు సూర్యభగవానుడి విగ్రహం సమీపంలో పవిత్ర కలశాలను ఏర్పాటు చేసి, శివాచార్యుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్థాపన పూజ నిర్వహించారు. అనంతరం అరుణాచలేశ్వర స్వామికి, ఉణ్ణామలై అమ్మవారికి పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆలయంలోని అన్ని సన్నిధుల్లోనూ పవిత్ర జలాన్ని చల్లి, సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.