ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎంఎస్ ధోనీ.. క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం

  • ఈ ఏడాది ఏడుగురు క్రికెటర్లకు ఈ ఘనత
  • భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనీ
  • ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లాకు కూడా చోటు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్-బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిన్న ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ధోనీకి స్థానం లభించింది. ఈ ఏడాది ఈ గౌరవం పొందిన ఏడుగురు క్రికెటర్లలో ధోనీ ఒకడు కావడం విశేషం. ఆయనతో పాటు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హషీమ్ ఆమ్లా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

"ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండటం, అసమానమైన వ్యూహాత్మక నైపుణ్యం ఎంఎస్ ధోనీ సొంతం. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆయనో మార్గదర్శకుడు. ఆట ముగించడంలో మేటిగా, గొప్ప నాయకుడిగా, అద్భుతమైన వికెట్ కీపర్‌గా ధోనీ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం కల్పించాం" అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 17,266 పరుగులు సాధించాడు. వికెట్ల వెనుక 829 మందిని పెవిలియన్‌కు పంపాడు. ఈ గణాంకాలు ఆయన ప్రతిభనే కాకుండా, అసాధారణ నిలకడ, ఫిట్‌నెస్, సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడిన తీరును ప్రతిబింబిస్తాయని ఐసీసీ కొనియాడింది.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, అద్భుతమైన వ్యూహ చతురత, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆయన చూపిన ప్రభావం అమోఘమని ఐసీసీ ప్రశంసించింది.

వన్డే క్రికెట్‌లో ధోనీ పేరిట అనేక రికార్డులున్నాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు (123), వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు (183 నాటౌట్), భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడం (200) వాటిలో కొన్ని మాత్రమే. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2011లో భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించడం ధోనీ కెరీర్‌లో గొప్ప విజయంగా నిలిచిపోయింది.

ఈ గౌరవంపై ధోనీ స్పందిస్తూ "తరతరాల క్రికెటర్ల సేవలను, ప్రపంచవ్యాప్తంగా వారి కృషిని గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందడం గౌరవంగా భావిస్తున్నాను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల సరసన నా పేరు చేరడం అద్భుతమైన అనుభూతి. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని తన సంతోషం వ్యక్తం చేశారు.

2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ధోనీ ఇప్పటికీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. తాజాగా ఈ గుర్తింపుతో ఆయన పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.


More Telugu News