ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి కేసిఆర్, కేటీఆర్, హరీశ్ రావు సంతాపాలు

  • గోపీనాథ్ మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటన్న కేసీఆర్
  • సౌమ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారని ప్రశంస 
  • మాగంటి కుటుంబం, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, టి. హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మరోవైపు కేటీఆర్, టి. హరీశ్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాగా, గోపీనాథ్ మృతి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు నల్లగొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. 


More Telugu News