ఛత్తీస్ గఢ్ లో నేడు కూడా కాల్పుల మోత... మరో మావోయిస్టు అగ్రనేత మృతి

  • ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు
  • తెలంగాణ మావోయిస్టు నేత మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ మృతి
  • భాస్కర్ తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్టు ప్రకటన
  • మృతుడు ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలం పొచరా వాసి
  • ఘటనా స్థలంలో ఏకే-47 తుపాకీ స్వాధీనం
గత కొన్ని రోజులుగా మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందడం తెలిసిందే. తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత హతమయ్యారు. 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ (45) మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుడు భాస్కర్ స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా, బోథ్‌ మండలం పరిధిలోని పొచరా గ్రామంగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కోబ్రా (కమెండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు భీకర పోరు నడిచింది.

కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఒక మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌గా నిర్ధారించారు. భాస్కర్ తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌తో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.


More Telugu News