మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు కారణమేంటో చెప్పిన దాసోజు శ్రవణ్

  • జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు గుండె సంబంధిత సమస్య
  • గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స
  • ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెల్లడి
  • బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య ఘటనతో తీవ్ర ఒత్తిడికి గురైన ఎమ్మెల్యే
  • పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు
  • 48 గంటల తర్వాత వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదల
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ వెల్లడించారు.

మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్యం గురించి దాసోజు శ్రవణ్‌ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. వైద్యులు ఆయనను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారని, ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా హెల్త్‌ బులెటిన్ విడుదల చేస్తారని వివరించారు.

ఇటీవల బోరబండ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఘటనతో మాగంటి గోపీనాథ్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మీడియాకు తెలిపారు. 

మాగంటి గోపీనాథ్‌ ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ముఠా గోపాల్‌ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తదితరులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వారు గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీనియర్‌ వైద్యుల బృందం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తోందని, ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా బయటకు వస్తారనే విశ్వాసం తమకుందని దాసోజు శ్రవణ్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News