నీది మామూలు ఘనత కాదు... ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ కు గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

  • ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీకి దక్కిన తొలి ఐపీఎల్ టైటిల్
  • ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపు
  • కెప్టెన్ రజత్ పాటిదార్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విరాట్ కోహ్లీ
  • ధోనీ తర్వాత మరో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. దాదాపు 18 సంవత్సరాలుగా ఊరిస్తున్న టైటిల్‌ను రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారిగా ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది.

ఈ నేపథ్యంలో, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కు లెజెండరీ ఆటగాడు విరాట్ కోహ్లీ కానుక ఇచ్చాడు. విజయం అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో కోహ్లీ వెంట ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఒంటరిగా కూర్చుని, విజయాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యం కోహ్లీ కంటపడింది. వెంటనే కోహ్లీ తన ఎంఆర్ఎఫ్ బ్యాట్‌లలో ఒకదానిని తీసుకుని రజత్ పటిదార్‌కు బహుమతిగా ఇచ్చి అభినందించాడు. దిగ్గజం నుంచి లభించిన ఈ అమూల్యమైన బహుమతిని రజత్ పటిదార్ ఆనందంగా స్వీకరించాడు. ఆ బ్యాట్ ను సంతోషంతో ముద్దాడి మురిసిపోయాడు. 

ఈ సందర్భంగా  కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ గాయపడిన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చి, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ గా అవతరించావు... నిజంగా ఎంతటి అద్బుతమైన ఘనత అని రజత్ పటిదార్ ను కొనియాడాడు.

పటిదార్ ప్రస్థానం – ఎన్నో మలుపులు

రజత్ పాటిదార్ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలతో సాగింది. 2021లో ఆర్‌సీబీ జట్టులోకి వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో జట్టు అతడిని విడుదల చేసింది. 2022 ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే, లవ్‌నీత్ సిసోడియా గాయపడటంతో అతడి స్థానంలో ఆర్‌సీబీ పాటిదార్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్ ప్లేఆఫ్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పాటిదార్ చేసిన అద్భుతమైన సెంచరీ అతని కెరీర్‌లోనే ఒక కీలక మలుపు.

ఈ ప్రదర్శనతో 2023 సీజన్‌కు ఆర్‌సీబీ అతడిని అట్టిపెట్టుకున్నప్పటికీ, మడమ గాయం (అకిలెస్ హీల్ ఇంజ్యూరీ) కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయినా పట్టు వదలకుండా, ఐపీఎల్ 2024లో 13 ఇన్నింగ్స్‌లలో 395 పరుగులు చేసి సత్తా చాటాడు. ఫాఫ్ డు ప్లెసిస్ ఫ్రాంచైజీని వీడటంతో, 2025 సీజన్‌కు ఆర్‌సీబీ యాజమాన్యం పటిదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో, యువ పటిదార్ తన నాయకత్వ పటిమతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఆద్యంతం ఆర్‌సీబీ ఆధిపత్యం చెలాయించింది. 2016 తర్వాత తొలిసారిగా లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి, చివరికి టైటిల్‌ను ముద్దాడింది.


More Telugu News