ఆర్‌సీబీకి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషెస్

  • 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ఐపీఎల్ తొలి టైటిల్ గెలుచుకున్న ఆర్‌సీబీ 
  • సినీ ప్రముఖుల అభినందనలు   
  • ఇది చూడటానికి చాలా సంతోషకరమైన క్షణమ‌న్న రౌడీబాయ్ 
  • ఆర్‌సీబీకి బిగ్ కంగ్రాట్స్‌ అంటూ బ‌న్నీ ట్వీట్‌
18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ఐపీఎల్ తొలి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శంతను భాగ్యరాజ్ సహా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. 

"ఆర్‌సీబీ జ‌ట్టుకు, అభిమానులకు అభినందనలు. మీరు చాలా అభిరుచితో, ప్రేమతో వేచి చూశారు. ఇది చూడటానికి చాలా సంతోషకరమైన క్షణం" అని రౌడీ బాయ్ ట్వీట్ చేశారు.

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌కు విషెస్ తెలియ‌జేశారు. "నిరీక్ష‌ణ‌ ముగిసింది. 'ఈ సాలా కప్ నమ్దే!' ఈ రోజు కోసం మేము 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. ఆర్‌సీబీకి బిగ్ కంగ్రాట్స్‌!" అని బ‌న్నీ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 

బెంగళూరు ఫ్రాంచైజీని అభినందిస్తూ తమిళ నటుడు శంతను భాగ్యరాజ్ కూడా ట్వీట్ చేశారు. "ఆర్‌సీబీ జ‌ట్టుకు అభినందనలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను... జట్టుగా మీరు ఎంత గొప్ప ప్రయాణం చేశారు. 18 సంవత్సరాలుగా విధేయతతో మద్దతు ఇచ్చిన అభిమానులంద‌రూ ఈ వేడుకకు అర్హులు. ఫైన‌ల్‌లో పంజాబ్ కింగ్స్ కూడా బాగా ఆడింది. కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం చూడటం ఒక భావోద్వేగ క్షణం" అని ట్వీట్ చేశారు. 

ఇక‌, మంగళవారం అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో సంచలన విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌లో తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్న విష‌యం తెలిసిందే. 


More Telugu News