Kamal Haasan: కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

Kamal Haasan Warned by Karnataka High Court Over Kannada Language Remarks

  • కన్నడ భాషపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచన
  • మనోభావాలు దెబ్బతీయొద్దు, క్షమాపణ చెప్పాలని హితవు
  • కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా విడుదలపై నీలినీడలు
  • క్షమాపణ చెప్పకుంటే రిలీజ్ కష్టమే.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అల్టిమేటం

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది.

"మీరు సామాన్యులు కారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం.. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి" అని కోర్టు పేర్కొంది. కమల్ హాసన్ కొత్త సినిమా 'థగ్ లైఫ్' గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, "కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు... కానీ కన్నడ ప్రజలు వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే, తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. "నా జీవితం, నా బంధుత్వం తమిళం. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకెక్కారు.

కాగా, కమల్ హాసన్ సినిమా 'థగ్ లైఫ్' విడుదలను కర్ణాటకలో అడ్డుకోవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) సోమవారం ఈ సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధించింది. కమల్ క్షమాపణ చెప్పే వరకు సినిమా విడుదలకు అనుమతించేది లేదని కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం.ఎం. నరసింహులు స్పష్టం చేశారు. అయితే, తాను తప్పు చేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కమల్ హాసన్ గత శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కూడా కమల్ హాసన్‌పై మండిపడ్డారు.

Kamal Haasan
Karnataka High Court
Thug Life
Kannada language
Tamil language origin
Karnataka Film Chamber of Commerce
M M Narasimhulu
V Yeddyurappa
DMK party
Movie release ban
  • Loading...

More Telugu News