గాలిలోకి ఎగిరాక సేఫ్టీ బెల్ట్ విప్పేసింది.. పారాసైలింగ్ లో ప్రమాదం.. వీడియో ఇదిగో!

  • 160 అడుగుల పైనుంచి పడి యువతి మృతి
  • ఉచితంగా గాల్లో విహరించవచ్చని ఆశపడి ప్రాణం పోగొట్టుకుంది
  • పైకి లేచాక తీవ్ర భయాందోళనకు గురైన యువతి
  • మాంటెనెగ్రోలో విషాదకర సంఘటన
మాంటెనెగ్రోలో పారాసైలింగ్‌ సరదా ఓ యువతి పాలిట శాపంగా మారింది. గాల్లో విహరిస్తూ తీవ్ర భయాందోళనకు గురై సేఫ్టీ హార్నెస్‌ను విప్పేసుకోవడంతో, సెర్బియాకు చెందిన 19 ఏళ్ల టియానా రాడోన్‌జిక్ సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గత వారం బుడువాలోని అడ్రియాటిక్ సముద్రంలో చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. సెర్బియాకు చెందిన టియానా తన అత్తతో కలిసి విహారయాత్ర కోసం బుడువాకు వచ్చింది. బీచ్‌లో ఓ ప్రతినిధి ఉచిత పారాసైలింగ్ రైడ్ ఆఫర్ చేయడంతో టియానా అంగీకరించినట్లు సమాచారం. పారాసైలింగ్ చేస్తుండగా టియానా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ స్థితిలోనే తన లైఫ్ జాకెట్, సేఫ్టీ బెల్ట్ విప్పేసింది. దీంతో సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి గాలించినప్పటికీ, అప్పటికే టియానా మృతి చెందినట్లు ధృవీకరించారు.

అయితే, స్థానిక పర్యాటక ఏజెన్సీ కోసం ప్రచార వీడియో చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని మరికొన్ని కథనాలు పేర్కొన్నాయి. "పానిక్ అటాక్" కారణంగానే టియానా ఈ చర్యకు పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

పారాసైలింగ్ సంస్థ యజమాని మిర్కో క్రడ్జిక్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "యాక్టివిటీకి ముందు టియానా బాగానే ఉంది, ఆమె భయపడినట్లు కనిపించలేదు. పారాసైలింగ్ కు ముందు శిక్షణ కూడా ఇచ్చాం. పైకి వెళ్లాక ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అన్ని పరికరాలను సాంకేతికంగా తనిఖీ చేస్తున్నాం, పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


More Telugu News