పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవాలనుకోవడం లేదు.. మమ్మల్ని కెలకొద్దు: శశిథరూర్ హెచ్చరిక

  • బ్రెజిల్‌లో భారత పార్లమెంటరీ బృందం విస్తృత పర్యటన
  • ఉగ్రవాదంపై భారత్‌ 'జీరో టాలరెన్స్' విధానంపై స్పష్టత
  • 'ఆపరేషన్ సిందూర్'కు బ్రెజిల్ సంపూర్ణ మద్దతు
  • పహల్గామ్ దాడిని ఖండించిన బ్రెజిలియన్ నేతలు
పాకిస్థాన్‌ను భారత్‌లో విలీనం చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సరిహద్దు ఉగ్రవాదం లేని శాంతి, శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం  స్పష్టం చేసింది. బ్రెజిల్‌లో పర్యటిస్తున్న అఖిలపక్ష భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందం నేడు ఆ దేశ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు అత్యంత ఫలవంతంగా ముగిశాయి. బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లోని విదేశీ వ్యవహారాలు, జాతీయ రక్షణ కమిటీ అధ్యక్షుడు ఫిలిపే బారోస్‌తో భారత నేతలు సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు బ్రెజిల్ మద్దతు ఉంటుందని బారోస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్రంగా విమర్శించారు.

"మేము పాకిస్థాన్‌ను మళ్లీ ఆక్రమించుకోవాలని లేదా భారత్‌లో భాగం చేసుకోవాలని అనుకోవడం లేదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే మా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెడతాం. శతాబ్దాలుగా ఇదే భారత దేశ విధానం. మాకు యుద్ధాలు, ఘర్షణలు ఎందుకు కావాలి? అవన్నీ అవతలి వైపు నుంచే వస్తున్నాయి" అని థరూర్ అన్నారు. "మేము ఈ చర్య ఎందుకు తీసుకున్నామో ప్రపంచం అర్థం చేసుకోవాలి, మాకు వేరే దారి లేదు. మీరు (పాకిస్థాన్) మమ్మల్ని వదిలేస్తే, మేము మిమ్మల్ని వదిలేస్తాం. కానీ ఉగ్రవాదంతో మమ్మల్ని గాయపరిస్తే, ఇలాగే బదులిస్తాం" అని ఆయన హెచ్చరించారు.

"సబ్-కన్వెన్షనల్ వార్‌ఫేర్ అనే పదం ఉంది. ఇది చాలా నీచమైన పద్ధతి, ఎందుకంటే వారు (పాకిస్థాన్) పౌరులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటారు. సంప్రదాయ యుద్ధంలో మమ్మల్ని ఓడించలేరు, అందుకే ఇలాంటివి ప్రయత్నిస్తారు. మేము ఉగ్రవాదాన్ని నమ్మం, కానీ వారు ఉగ్రవాదులతో దాడి చేస్తే, మేము సంప్రదాయ యుద్ధంతో బదులిస్తాం. మా వాయుసేన, సైన్యం, నౌకాదళాన్ని ఉపయోగిస్తాం. వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం, కాబట్టి వారు అర్థం చేసుకోవాలి. దీన్ని ఆపేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం, నేరస్థులను అరెస్టు చేయడం ఒక్కటే మార్గం. కానీ వారు అలా చేయరు. ఎందుకంటే దురదృష్టవశాత్తు పాకిస్థాన్ దేశం అలా తయారైంది" అని థరూర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

శాంతి కోసం మహాత్మా గాంధీ కశ్మీర్‌ను వదులుకునేవారా? అని బ్రెజిల్ అధికారి ఒకరు అడిగిన ప్రశ్నకు థరూర్ గట్టిగా బదులిస్తూ "ఏ భారతీయ నాయకుడైనా అలా చేస్తారని నేను అనుకోను. తలపై తుపాకీ గురిపెట్టిన వారికి లొంగిపోవాలని మహాత్మాగాంధీ ఎప్పుడూ కోరుకోలేదు. బ్రిటిష్ వారు తమ పోలీసులు లేదా తుపాకులతో వచ్చినప్పుడు, వారికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడాలనే సందేశాన్ని మాకు నేర్పించారు. గాంధీ చాలా కఠినమైన స్థితిలో ఉన్నారు, చాలా మంది గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. మన జాతీయ హీరోలలో ఒకరైన లాలా లజపత్ రాయ్‌ను ఒక బ్రిటిష్ అధికారి తన రైఫిల్‌తో తలపై కొట్టారు. మన జాతీయ వీరులు హింసను ప్రతిఘటించారు. మహాత్మాగాంధీ బ్రిటిష్ వారికి లొంగిపోయినట్టు ఎప్పుడూ అంగీకరించలేదు. నేటి భారత్ కూడా లొంగిపోదు. మేము లొంగిపోతామని పాకిస్థాన్ అనుకుంటే.. క్షమించండి, మేము లొంగిపోము" అని స్పష్టం చేశారు.

ఫెడరల్ డిప్యూటీ ఫిలిపే బారోస్ మాట్లాడుతూ "బ్రెజిల్, భారత్‌లకు ప్రజల వైవిధ్యం వంటి అనేక సారూప్యతలు ఉన్నాయి. ఈ వైవిధ్యం మన దేశాలకు ఒక మైలురాయి. మన సవాళ్లు కూడా ఒకేలా ఉన్నాయి. బ్రెజిల్‌లో మాకు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల రవాణా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై మనం సహకరించుకోవచ్చు. మేము వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద సంస్థలపై అధ్యయనం చేస్తున్నాం. ఉగ్రవాదానికి సంబంధించి భారత ప్రజలకు సంఘీభావంగా మా కమిషన్‌కు ఒక సంయుక్త ప్రకటన సమర్పించాలని నేను సూచిస్తున్నాను" అని అన్నారు.

భారత ప్రతినిధి బృందం ఇండియా-బ్రెజిల్ ఫ్రెండ్‌షిప్ ఫ్రంట్ అధ్యక్షుడు, సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు అయిన సెనేటర్ నెల్సిన్హో ట్రాడ్‌ను కూడా కలిసింది. ఈ సమావేశం అనంతరం థరూర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ "సెనేటర్ నెల్సిన్హో ట్రాడ్‌తో అద్భుతమైన, అత్యంత ఫలవంతమైన సమావేశం జరిగింది. ఇటీవలి సంఘటనలపై భారత దృక్పథాన్ని ఆయన లోతుగా అర్థం చేసుకోవడం, గట్టిగా సమర్థించడాన్ని అభినందిస్తున్నాను. ఇటువంటి సంఘీభావం మన ప్రజాస్వామ్యాల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది!" అని పేర్కొన్నారు.

ప్రతినిధి బృందంలోని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా ‘ఎక్స్’ లో స్పందిస్తూ, "భారత్, బ్రెజిల్ అనేక బహుపాక్షిక వేదికలపై లోతైన భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రాముఖ్యత, ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలపై మేము చర్చించాం" అని తెలిపారు. 


More Telugu News