'స్పిరిట్' వివాదం.. దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం

  • 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా తప్పుకున్నారన్న వార్తలపై మణిరత్నం స్పందన
  • నటి డిమాండ్లను సమర్థించిన ప్రముఖ దర్శకుడు
  • 8 గంటల పనిదినం కోరడం సరైనదేనన్న మణిరత్నం
  • తల్లిగా ఉన్న నటీమణులకు వెసులుబాటు అవసరమని గతంలో అజయ్ దేవగణ్ వ్యాఖ్య
  • సినీ పరిశ్రమలో పని పరిస్థితులపై మరోసారి చర్చ
బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించి నెలకొన్న వివాదంపై సీనియర్ దర్శకుడు మణిరత్నం స్పందించారు. దీపికా కొన్ని షరతులు విధించారని, వాటిలో భాగంగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, రూ.20 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాలని, తెలుగులో డైలాగులు చెప్పనని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక, ఆమె స్థానంలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై మణిరత్నం మాట్లాడుతూ దీపికా డిమాండ్లను గట్టిగా సమర్థించారు.

న్యూస్ 18కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ... "ఆమె డిమాండ్లు పూర్తిగా సరైనవని నేను భావిస్తున్నాను. అలాంటి డిమాండ్లు చేసే స్థాయిలో ఆమె ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒక చిత్ర నిర్మాతగా, నటీనటులను ఎంపిక చేసేటప్పుడు ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన సరిహద్దులు ఉండాలి. ఫిల్మ్‌మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి, అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా పనిచేయాలి" అని తెలిపారు. 

దీపికా విషయంలో మణిరత్నం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో నటులు అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్ కూడా దీపికా వైఖరికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా 8 గంటల ప‌నివేళ‌ల‌ గురించి అజయ్ దేవగణ్ ప్రస్తావిస్తూ... "ఈ విషయం చాలా మందికి రుచించడం లేదనడం సరికాదు. నిజాయితీగల చాలా మంది చిత్రనిర్మాతలకు దీంతో సమస్య ఉండదు. దీనికి తోడు తల్లిగా ఉంటూ ఎనిమిది గంటలు పనిచేయడం అనేది క‌ష్టం" అని పేర్కొన్నారు. పని-జీవిత సమతుల్యత ప్రాముఖ్యతను, ముఖ్యంగా పనిచేసే తల్లులకు ఇది ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పారు.

ఈ వివాదం సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన అంచనాలు, పని పరిస్థితులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీపికా డిమాండ్లను "అన్‌ప్రొఫెషనల్" అని విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె వైఖరికి మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. 

ఈ చర్చ కొనసాగుతున్న తరుణంలో, దీపికాకు మణిరత్నం మ‌ద్ధ‌తు పలకడం, పరిశ్రమలో పనివేళలు, వృత్తిపరమైన హద్దుల విషయంలో మారుతున్న దృక్పథాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక‌, మ‌ణిర‌త్నం, క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో తెర‌కెక్కిన థ‌గ్ లైఫ్ జూన్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ విడుద‌ల త‌ర్వాత ఆయ‌న‌ కొన్ని రోజులు విరామం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. అనంత‌రం త‌న త‌ర్వాతి ప్రాజెక్టుపై దృష్టిసారించ‌నున్నారు. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌ర నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నా.. వాటిలో ఏదీ పూర్తిగా సిద్ధం కాలేద‌ని మ‌ణిర‌త్నం తెలిపారు.  


More Telugu News