హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు... ఫిలిం చాంబర్ కు నిర్మాత ఏఎం రత్నం వినతి

  • హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపునకు నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా మేరకే ఈ చర్యలు
  • ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు అధికారిక లేఖ అందజేత
  • జూన్ 12న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తన భారీ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సవరణ, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి కోరుతూ అధికారికంగా అడుగులు వేశారు. ఈ మేరకు ఆయన నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈ అభ్యర్థనను సరైన పద్ధతిలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించి తమ విజ్ఞప్తిని అందజేశారు. ఇటీవల థియేటర్ల మూసివేత కలకలం నేపథ్యంలో, పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదే సమయంలో టికెట్ రేట్ల పెంపు అంశంపై స్పందిస్తూ, నిర్మాతలు ఎవరికి వారుగా వచ్చి ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్ల పెంపును కోరడం కాకుండా, నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ద్వారా టికెట్ రేట్ల ప్రతిపాదనలు పంపుకోవాలని సూచించారు. ఈ మేరకు నిర్మాత ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ను సంప్రదించారు.

హరిహర వీరమల్లు' చిత్రం భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో, టికెట్ ధరల విషయంలోనూ, అదనపు షోల ప్రదర్శనల విషయంలోనూ ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్‌కు అందిన ఈ వినతి పత్రాన్ని వారు పరిశీలించి, తదుపరి చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఈ పరిణామంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


More Telugu News