Banoth Krishna: చేపల చెరువులో విషప్రయోగం.. 5 టన్నుల చేపలు మృతి

––
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని శీత్లా తండాలోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేశారు. దీంతో 5 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
శీత్ల తండాకు చెందిన బానోత్ కృష్ణ అనే రైతు ఉపాధి హామీ పథకంలో భాగంగా మూడేళ్ల క్రితం తన పొలంలో 30 కుంటల విస్తీర్ణంలో చేపల చెరువును ఏర్పాటు చేసుకున్నాడు. రూ.3 లక్షల పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దుండగులు చేపల చెరువులో విష గుళికలు చల్లారు. దీంతో 5 టన్నుల మేర చేపలు మృత్యువాతకు గురయ్యాయి.
ఈ ఘటనపై బాధిత రైతు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కాగా, స్థానిక రాజకీయాల్లో కృష్ణ చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.