Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్!

- ఆస్ట్రేలియాకు రెండు వన్డే ప్రపంచకప్‌లు అందించడంలో మ్యాక్సీ కీలక పాత్ర
- వన్డేల్లో 149 మ్యాచ్‌లలో 3,990 పరుగులు, 77 వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్
- శారీరక ఇబ్బందులు, యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం
- వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ పై దృష్టిసారించనున్నట్లు వెల్లడి
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను గెలవడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (2015, 2023) గెలవడంలో మాక్స్‌వెల్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.
36 ఏళ్ల మాక్స్‌వెల్ ఆగస్టు 2012లో తన వన్డే అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 149 వన్డే మ్యాచ్‌లు ఆడి 126.7 స్ట్రైక్ రేట్‌తో 3,990 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్న మాక్స్‌వెల్... 5.46 ఎకానమీ రేటుతో 77 వికెట్లు పడగొట్టాడు.
మాక్స్‌వెల్ తన రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ... "కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా, చాలా త్వరగా నాకు జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియా తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడగలిగినందుకే గర్వపడ్డాను. అప్పుడు అదే గొప్ప విషయంగా భావించాను. ఆ తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. జట్టు నుంచి తొలగించబడటం, మళ్లీ వెనక్కి రావడం, కొన్ని ప్రపంచకప్‌లలో ఆడటం, గొప్ప జట్లలో భాగం కావడం జరిగాయి" అని తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నాడు.
2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతూనే, 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. 128 బంతుల్లో అజేయంగా 201 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
వన్డే క్రికెట్‌లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, దానికి తోడు కాలి గాయం కూడా తన ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని మాక్స్‌వెల్ వివరించాడు. 2027 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని భావించినట్లు తెలిపాడు. "నా శరీరం స్పందిస్తున్న తీరు చూస్తుంటే జట్టును నిరాశపరుస్తున్నట్లు అనిపించింది. దీనిపై జార్జ్ బెయిలీతో సుదీర్ఘంగా చర్చించాను. భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన అభిప్రాయం అడిగాను" అని మాక్స్‌వెల్ 'ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్'లో చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... "2027 ప్రపంచకప్ గురించి మేం మాట్లాడుకున్నాం. 'ఆ టోర్నీ వరకు నేను ఆడగలనని అనుకోవడం లేదు. నా స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి, వారిని ఆ స్థానానికి సిద్ధం చేయాల్సిన సమయం ఇది' అని ఆయనతో చెప్పాను. ఆ స్థానంలో కుదురుకోవడానికి వారికి తగినంత సమయం దొరుకుతుందని ఆశిస్తున్నా. నేను ఇంకా ఆడగలనని భావిస్తున్నంత కాలం నా స్థానాన్ని వదులుకోకూడదని ఎప్పుడూ అనుకునేవాడిని. కేవలం కొన్ని సిరీస్‌ల కోసం స్వార్థపూరితంగా జట్టులో కొనసాగాలని అనుకోలేదు" అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ... "వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత డైనమిక్ ఆటగాళ్లలో మాక్స్‌వెల్ ఒకడు. రెండు వన్డే ప్రపంచకప్ విజయాల్లో ఆయనది కీలక పాత్ర. ఆయన సహజ ప్రతిభ, నైపుణ్యం అసాధారణమైనవి. ఫీల్డింగ్‌లో ఆయన చురుకుదనం, బౌలింగ్‌లో అద్భుతమైన సామర్థ్యం జట్టుకు బాగా ఉపయోగపడ్డాయి. ఆస్ట్రేలియా వన్డే టీమ్‌కు సుదీర్ఘకాలం సేవలు అందించడం అద్భుతం. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనే ఆయన తపన, నిబద్ధత ప్రశంసనీయం. టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు ఆయన సేవలు కొనసాగుతాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ప్రపంచకప్ దిశగా జట్టును నిర్మిస్తున్న తరుణంలో రాబోయే 12 నెలల్లో ఆయన అత్యంత కీలకంగా మారతారు" అని తెలిపాడు.