Kiren Rijiju: వంతెనపై నుంచి నది దాటుతుంటే ముంచెత్తిన వరద.. వీడియో ఇదిగో!

Kiren Rijiju Shares Video of Man Crossing Flooded River in Arunachal Pradesh
  • వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  • అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం
  • కుండపోత వర్షాలకు రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పట్టేలా, ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు పంచుకున్నారు. ఈ దృశ్యం స్థానికుల దయనీయ స్థితిని, వారి తెగువను కళ్లకు కడుతోంది. అంజావ్ జిల్లాలో, భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల సమీపంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

కొన్నిరోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉద్దృతంగా ప్రవహిస్తున్న ఓ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వెదురు, తాడు, చెక్కలతో నిర్మించిన ఆ వేలాడే వంతెన మీదుగా ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. వంతెన చాలా వరకు దెబ్బతిని, కొన్ని చోట్ల కొట్టుకుపోయి నీట మునిగి ఉంది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా, వంతెన పైనున్న తాడులను పట్టుకుని ఆ వ్యక్తి నదిని దాటుతున్న తీరు, అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలను తెలియజేస్తోంది. "దయచేసి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం మీకు అవసరమైన సహాయం అందిస్తుంది" అని రిజిజు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

గత 48 గంటల్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పెమా ఖండూ శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత ప్రజలకు జిల్లా యంత్రాంగాల ద్వారా అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో ప్రయాణాలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Kiren Rijiju
Arunachal Pradesh
floods
heavy rainfall
Anjaw district
India China border
suspension bridge
natural disaster
Pema Khandu
landslide

More Telugu News