Kavitha: జై తెలంగాణ అని రేవంత్ అనకపోవడం దారుణం: కవిత

Kavitha Criticizes CM for Not Saying Jai Telangana

  • జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత
  • కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న కవిత
  • అమరవీరులకు సీఎం నివాళి అర్పించే వరకు ఉద్యమిస్తామని ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె జాతీయ పతాకంతో పాటు, జాగృతి జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని, వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేశారు. పోరాటాలు, త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న జాగృతి కార్యకర్తలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో తొలిసారిగా జెండాలు ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అయితే, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం 'జై తెలంగాణ' అని కూడా పలకలేని దుస్థితిలో ఉండటం అత్యంత దారుణమని, ఇది తెలంగాణ ప్రజల దురదృష్టమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తున్నామని ఆమె అన్నారు.

అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించేంత వరకు తెలంగాణ జాగృతి తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. "తెలంగాణ రాష్ట్రం మీద, రాష్ట్ర వనరుల మీద జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడతాం," అని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో జాగృతి ఎప్పుడూ ముందుంటుందని కవిత పేర్కొన్నారు.

Kavitha
MLC Kavitha
Telangana Formation Day
KCR
Telangana Jagruthi
Revanth Reddy
Jai Telangana
Telangana Politics
Telangana Martyrs
  • Loading...

More Telugu News