Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఆలస్యంపై నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ

- 'హరి హర వీరమల్లు' ట్రైలర్‌పై నిర్మాత కీలక అప్‌డేట్
- రెండో భాగం సీజీ పనుల వల్లే ట్రైలర్ విడుదలకు జాప్యం
- గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాకే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామన్న ఏఎం రత్నం
- జూన్ 12న ప్రేక్షకుల ముందుకు 'హరి హర వీరమల్లు' ఫస్ట్ పార్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. చారిత్రక నేపథ్యంతో, భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.
దీంతో సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్మాత ఏఎం రత్నం వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్ విడుదల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు.
సినిమా ట్రైలర్ విడుదల ఎప్పుడు అనే ప్రశ్నకు ఏఎం రత్నం స్పందిస్తూ... "ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం మాకు తెలుసు. అయితే, 'హరి హర వీరమల్లు' రెండో భాగంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ) వర్క్ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల కొంత ఆలస్యం అయింది. ప్రస్తుతం ఈ సీజీ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ట్రైలర్‌ను విడుదల చేస్తాం" అని తెలిపారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సినిమా విడుదల తేదీని ప్రకటించామని ఆయన వివరించారు. అలాగే, ఈ సినిమా దర్శకత్వంలో జరిగిన మార్పు గురించి కూడా ఏఎం రత్నం స్పష్టత ఇచ్చారు.
"ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించాల్సి ఉంది. సినిమా లైన్ చెప్పింది కూడా ఆయనే. ఆ కథ నాకు బాగా నచ్చింది. పవన్ కల్యాణ్ చేస్తేనే ఈ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని క్రిష్ చెప్పారు. అంతా సిద్ధమవుతున్న సమయంలో కొవిడ్ మహమ్మారి వచ్చింది. దానివల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఆ తర్వాత క్రిష్ కు ఇతర సినిమా కమిట్‌మెంట్‌లు ఉండటంతో, అనుకోకుండా మా అబ్బాయి జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు" అని ఏఎం రత్నం అన్నారు.
మొత్తానికి 'హరి హర వీరమల్లు' మొదటి భాగం ప్రకటించిన తేదీకే, అంటే జూన్ 12న విడుదలవుతుందని నిర్మాత స్పష్టం చేశారు. ట్రైలర్ కొంత ఆలస్యమైనప్పటికీ, సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా తదితరులు నటిస్తున్నారు.