Nara Rohit: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

- హీరోయిన్ సిరితో ఏడడుగులు వేయనున్న నారా రోహిత్
- అక్టోబర్ లో తమ పెళ్లి జరగబోతోందని వెల్లడి
- గత ఏడాది తండ్రి మరణంతో వాయిదా పడ్డ పెళ్లి
హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. చాలా కాలం తర్వాత ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పెళ్లి గురించి ఓ తీపి కబురు చెప్పారు. హీరోయిన్ సిరితో తన పెళ్లి అక్టోబర్ లో జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.
నారా రోహిత్, సిరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. వాస్తవానికి, వీరి వివాహం గత డిసెంబర్‌లోనే జరగాల్సి ఉండగా, అనుకోని విషాదం చోటుచేసుకుంది. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో పెళ్లి వాయిదా పడింది.
ఈ విషయంపై ‘భైరవం’ చిత్ర విజయోత్సవ సభలో స్పందించిన నారా రోహిత్, "మా నాన్నగారు రామ్మూర్తి నాయుడుగారి సంవత్సరికం పూర్తయిన తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. దీంతో అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సిరి విషయానికొస్తే... ఆమె తెలుగు అమ్మాయి. స్వస్థలం రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. నారా రోహిత్, సిరి కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు ఒక్కటి కాబోతున్నారు. సిరి ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.