Ukraine: ఏడాదిన్నరకు పైగా ప్రణాళిక.. రహస్యంగా రష్యా భూభాగంలోకి డ్రోను.. ఉక్రెయిన్ సంచలనం

- రష్యాలోని ఐదు కీలక సైనిక వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి
- ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ పేరుతో రహస్య ఆపరేషన్
- టీయూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు, ఏ-50 రాడార్ విమానాలు సహా 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ వెల్లడి
- ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాల్లో తమ విమానాలకు నిప్పంటుకున్నట్టు అంగీకరించిన రష్యా
- దాడుల కోసం రష్యాలోకి ముందే డ్రోన్లను అక్రమంగా రవాణా చేసి, ట్రక్కుల్లో దాచిన ఉక్రెయిన్
రష్యా భూభాగంలోని ఐదు కీలక సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఆదివారం భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధరంగం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై ఈ దాడిని ‘అత్యంత సుదూర ఆపరేషన్’గా ఉక్రెయిన్ అభివర్ణించింది. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ అనే రహస్య కోడ్ నేమ్‌తో ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌బీయూ) ఈ దాడిని సమన్వయపరిచింది. ఉక్రెయిన్ నగరాలపై బాంబులు వేయడానికి ఉపయోగించే టీయూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు, ఏ-50 రాడార్ నిఘా, కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా కనీసం 41 విమానాలను దెబ్బతీసినట్లు ఎస్‌బీయూ పేర్కొంది.
‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ కార్యాచరణ ఇలా..
2022లో రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ క్రమం తప్పకుండా రష్యాలోని లక్ష్యాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. అయితే ఈసారి ఉపయోగించిన కార్యాచరణ విధానం భిన్నంగా ఉంది. ఏడాదిన్నరకు పైగా ప్రణాళిక తర్వాత ‘స్పైడర్ వెబ్’ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. మూడేళ్లకు పైబడిన యుద్ధంలో ‘మా అత్యంత సుదూర ఆపరేషన్’ ద్వారా ‘అద్భుతమైన’ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. లక్షిత వైమానిక స్థావరాల్లోని ‘వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకల్లో 34 శాతం’ దెబ్బతిన్నాయని, ఈ భారీ దాడిలో ఉక్రెయిన్ 117 డ్రోన్లను మోహరించిందని జెలెన్స్కీ చెప్పారు.
ఉక్రెయిన్ ఎస్‌బీయూ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ ప్రణాళికకు చాలా క్లిష్టమైన లాజిస్టిక్స్ అవసరమయ్యాయి. డ్రోన్లను ముందుగానే రష్యాలోకి అక్రమంగా రవాణా చేశారు. వాటిని ట్రక్కులపై ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల పైకప్పుల కింద దాచారు. దాడి సమయంలో ఆ నిర్మాణాల పైకప్పులను రిమోట్‌గా తెరిచి డ్రోన్లను సమీపంలోని లక్ష్యాల వైపు పంపించారు.
ఎస్‌బీయూ షేర్ చేసిన ఫోటోలలో రవాణా కంటైనర్లలో దాచినట్లుగా కనిపించే అనేక చిన్న నల్ల డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లను ఉక్రెయిన్ భూభాగం నుంచి కాకుండా ‘వైమానిక స్థావరాలకు అత్యంత సమీపం నుంచి’ ప్రయోగించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 4,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఒబ్లాస్ట్‌లోని బెలాయా వైమానిక స్థావరం, ఉత్తరాన యుద్ధరంగానికి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఒబ్లాస్ట్‌లోని ఒలెన్యా వైమానిక స్థావరం ఈ దాడిలో దెబ్బతిన్నాయి. ఈ రెండు వైమానిక స్థావరాల్లో రష్యా విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. టార్మాక్‌పై నుంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు కనిపించే వీడియోలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవనోవో, రియాజాన్ ప్రాంతాలతో పాటు రష్యా తూర్పు ప్రాంతంలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్‌లోని ఇతర ప్రాంతాల్లో దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
7 బిలియన్ డాలర్ల నష్టం
డ్రోన్ దాడుల ద్వారా రష్యా సైనిక విమానాలకు మొత్తం 7 బిలియన్ డాలర్ల విలువైన నష్టం కలిగించినట్టు ఉక్రెయిన్ ఎస్‌బీయూ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. "7 బిలియన్ డాలర్లు: ఎస్‌బీయూ ప్రత్యేక ఆపరేషన్ ఫలితంగా ఈ రోజు దెబ్బతిన్న శత్రువుల వ్యూహాత్మక విమానాల అంచనా వ్యయం ఇది" అని ఏజెన్సీ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. అయితే, రష్యా ఇప్పటివరకు ఈ వాదనను ధ్రువీకరించలేదు. ‘ఉక్రెయిన్ నగరాలపై బాంబులు వేయడానికి’ ఉపయోగించే 41 విమానాలు దెబ్బతిన్నాయని, టీయూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు, ఏ-50 రాడార్ నిఘా, కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నష్టం వాటిల్లిందని ఎస్‌బీయూ అంతకుముందు పేర్కొంది.
రష్యా ఆర్కిటిక్, తూర్పు సైబీరియాలోని ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాల్లోని స్థావరాలపై డ్రోన్ దాడి తర్వాత అనేక విమానాలకు నిప్పంటుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. మంటలను అదుపులోకి తెచ్చామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. డ్రోన్ టేకాఫ్ అయిన ట్రక్కు డ్రైవర్‌తో సహా పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యా ప్రభుత్వ ఏజెన్సీలు తెలిపాయి. అయితే దాడులకు సన్నాహాలు చేసిన వ్యక్తులను రష్యా భూభాగం నుంచి బయటకు తీసుకువచ్చినట్టు జెలెన్స్కీ చెప్పారు.
శాంతి చర్చల నేపథ్యంలో దాడి
రష్యా దండయాత్ర ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సున్నితమైన తరుణంలో ఈ దీర్ఘకాల ప్రణాళికతో కూడిన ఆపరేషన్ జరిగింది. రష్యా అధికారులతో సోమవారం చర్చల కోసం తన రక్షణ మంత్రి రుస్తెమ్ ఉమెరోవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఇస్తాంబుల్‌కు పంపుతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. మూడేళ్ల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలనే ఒత్తిడితో ఈ సమావేశానికి టర్కీ ఆతిథ్యం ఇస్తోంది.
నేటి నాటి సమావేశాన్ని ప్రతిపాదించడంలో రష్యా సీరియస్‌గా ఉందా అనే దానిపై గతంలో సందేహాలు వ్యక్తం చేసిన జెలెన్స్కీ "సంపూర్ణ, షరతులు లేని కాల్పుల విరమణ", ఖైదీలు, అపహరణకు గురైన పిల్లల తిరిగి అప్పగించడం తమ ప్రాధాన్యతలని చెప్పారు. గత కాల్పుల విరమణ అభ్యర్థనలను తిరస్కరించిన రష్యా.. తాము సొంత శాంతి నిబంధనలను రూపొందించామని పేర్కొంది. అయితే వాటిని ముందుగా వెల్లడించడానికి నిరాకరించింది.