గుకేశ్ చేతిలో ఓట‌మిని త‌ట్టుకోలేని కార్ల్‌స‌న్‌.. ఏం చేశాడో చూడండి!

  • నార్వే చెస్ టోర్నీలో అద‌రగొట్టిన‌ దొమ్మ‌రాజు గుకేశ్ 
  • వ‌ర‌ల్డ్ నం.01 మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను చిత్తు చేసిన వైనం
  • ఈ ఓట‌మిని త‌ట్టుకోలేక‌ పిడికిలితో ఒక్క‌సారిగా చెస్ బోర్డు టేబుల్‌ను గ‌ట్టిగా కొట్టిన కార్ల్‌స‌న్
నార్వే చెస్ టోర్నీలో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ దొమ్మ‌రాజు గుకేశ్ అద‌రగొట్టాడు. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించాడు. క్లాసిక‌ల్ చెస్ పోటీలో కార్ల్‌స‌న్‌ను ఓడించ‌డం గుకేశ్‌కు ఇదే తొలిసారి. ఇక‌, ఈ ఓట‌మిని త‌ట్టుకోలేని కార్ల్‌స‌న్ పిడికిలితో ఒక్క‌సారిగా చెస్ బోర్డు టేబుల్‌ను గ‌ట్టిగా కొట్టాడు. 

అనంత‌రం గుకేశ్‌కు రెండుసార్లు సారీ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. కాగా, కీల‌క పోరులో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడిని ఓడించ‌డంతో గుకేశ్ కొద్దిసేపు అలా షాక్‌లోనే ఉండిపోయాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు గుకేశ్‌ను మెచ్చుకుంటున్నారు. 

నార్వే చెస్ టోర్నీలో ఆరో రౌండ్ మొద‌టి నుంచి ప్ర‌శాంతంగా ఆడిన గుకేశ్.. కార్ల్‌స‌న్ చేసిన ఓ త‌ప్పిదాన్ని ఒడిసిప‌ట్టుకుని గేమ్‌పై పూర్తి ఆధిప‌త్యం చేలాయించాడు. చివ‌రికి ప్ర‌పంచ నంబ‌ర్ 3 గుకేశ్‌... వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ కార్ల్‌స‌న్‌ను చిత్తు చేశాడు. గ‌తేడాది ఇదే టోర్నీలో కార్ల్‌స‌న్‌ను మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ర‌మేశ్‌బాబు ప్ర‌జ్ఞానంద ఓడించిన విష‌యం తెలిసిందే. దీంతో సొంత‌వేదిక‌పై కార్ల్‌స‌న్ రెండుసార్లు మ‌నోళ్ల చేతిలో ఖంగుతిన్నాడు. 

కాగా, ప్రస్తుతం కార్ల్‌స‌న్ ఆరు రౌండ్ల‌లో రెండు విజ‌యాలు, ఒక ప‌రాజ‌యం, మూడు డ్రాల‌తో మొత్తం 9.1 పాయింట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో ఫాబియానో క‌రువానా ఉంటే... మూడో స్థానంలోకి గుకేశ్ దూసుకొచ్చాడు.  




More Telugu News