అలీకి స్పెషల్ గా మామిడిపండ్లు పంపించిన చిరంజీవి!

  • మామిడి పండ్లతో పాటు అర్ధాంగి సురేఖ వంటకాలను అలీకి పంపిన చిరంజీవి
  • ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అలీ అర్ధాంగి జుబేదా
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రముఖ హాస్య నటుడు అలీకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతిని పంపారు. అలీ, చిరంజీవిల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, ఈ మధ్య కాలంలో వారిద్దరూ ఒకే వేదికపై పెద్దగా కనిపించలేదు. చాలా సందర్భాలలో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ ఉంటారు.

తాజాగా, అలీకి చిరంజీవి ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని పంపారు. ప్రతి సంవత్సరం వేసవిలో హాస్యనటులు బ్రహ్మానందం, అలీలకు చిరంజీవి తన తోటలో పండిన మామిడి పండ్లను పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా తన తోటలో పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి చిరంజీవి పంపారు. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. మామిడి పండ్లతో పాటు చిరంజీవి అర్ధాంగి సురేఖ వంటలను కూడా పంపించారు.

సురేఖ వంటకాలను అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల 'అత్తమ్మాస్ కిచెన్' అనే ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు. అందులో ఉప్మా, రసం, పొంగల్, కేసరితో పాటు రెడీ టు మిక్స్ పొడులను కూడా పంపించారు. వీటితో వెంటనే వంటలను చేసుకోవచ్చు.

చిరంజీవి నుండి వచ్చిన ప్రత్యేక బహుమతి వీడియోను అలీ అర్ధాంగి జుబేదా తన యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిరంజీవి తమపై ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించారని జుబేదా సంతోషంగా చెప్పారు. 


More Telugu News