బీరు బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నాడంటూ సేల్స్ మన్ ను చితకబాదిన ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్

  • గ్రేటర్ నోయిడాలో ఘటన
  • చెంపదెబ్బలు కొట్టి, బెల్టుతో చితకబాదారని బాధితుడి వాంగ్మూలం
  •  సీసీటీవీ డీవీఆర్ తొలగించి, ఆఫీసులో నిర్బంధించారని బాధితుడి ఆరోపణ
  • సేల్స్‌మన్ మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడన్న ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
  • ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారి శాఖాపరమైన విచారణకు ఆదేశాలు
మద్యం సీసాలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నాడన్న ఆరోపణపై ఓ మద్యం దుకాణం సేల్స్‌మన్ ను ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చితకబాదిన ఘటన గ్రేటర్ నోయిడాలో కలకలం రేపింది. ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

దాద్రీకి చెందిన మనీష్ కుమార్ (29) అనే యువకుడు జగత్ ఫార్మ్‌లోని ఓ మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్ర శేఖర్, ఓ కానిస్టేబుల్‌తో కలిసి తన దుకాణానికి వచ్చారని మనీష్ ఆరోపించాడు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నావంటూ ఇన్‌స్పెక్టర్ తనపై నిందలు వేశారని తెలిపాడు. తాను అలా చేయడం లేదని చెప్పినా వినకుండా ఇన్‌స్పెక్టర్ తనను పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారని వాపోయాడు. అనంతరం దుకాణంలోని సీసీటీవీ కెమెరా డీవీఆర్‌ను తొలగించి, తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని గ్రేటర్ నోయిడా సెక్టార్ డెల్టా 3లోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారని మనీష్ వివరించాడు. అక్కడ తనను బెల్టుతో దారుణంగా కొట్టారని, తీవ్ర గాయాలతో తనను అక్కడే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడిలో తన కాళ్లు, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నాడు.

అదే మద్యం షాపులో పనిచేస్తున్న మనీష్ సోదరుడు రోహిత్, విషయం తెలుసుకుని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి మనీష్‌ను ఇంటికి తీసుకొచ్చినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం, జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మనీష్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అత్యవసర సహాయ నంబర్ 112కు కాల్ చేసినా, పలు పోలీస్ పోస్టులకు వెళ్లినా ఫలితం లేకపోయిందని వారు ఆరోపించారు. దీంతో శనివారం గ్రేటర్ నోయిడాలోని డీఎం కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారి సుబోధ్ కుమార్ స్పందించారు. శుక్రవారం సదరు సేల్స్‌మన్ ఎమ్మార్పీ ధర కంటే బీర్ సీసాలపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. "ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్ర శేఖర్, ఓ కానిస్టేబుల్‌ను తనిఖీ నిమిత్తం దుకాణానికి పంపించాం. ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం, వారు దుకాణానికి చేరుకునేసరికి సేల్స్‌మన్ మద్యం మత్తులో ఉన్నాడు, వారితో దురుసుగా ప్రవర్తించాడు. చలాన్ వేసేందుకు అధికారులు అతడిని తమ వాహనంలోకి తీసుకెళ్తుండగా, అతను అక్కడి నుంచి పారిపోయాడు" అని డీఈఓ వివరించారు. మనీష్‌కు గాయాలు తర్వాత తగిలి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. "ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం" అని డీఈఓ సుబోధ్ కుమార్ స్పష్టం చేశారు.


More Telugu News