హైద‌రాబాద్‌లో దారుణం.. ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌.. ఆల‌స్యంగా వెలుగులోకి ఘ‌ట‌న‌

  • హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న జ‌రిగిన‌ దారుణం
  • కారు పార్కింగ్ విష‌యంలో ఇద్ద‌రు వ్య‌క్తుల మధ్య ఘ‌ర్ష‌ణ‌.. ఒక‌రి మృతి
హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలో దారుణం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విష‌య‌మై జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణాలు తీసింది. కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న ఈ దారుణ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి మండ‌లం నారాయ‌ణ‌పురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి కుటుంబంతో క‌లిసి 13 ఏళ్లుగా కొత్త‌పేటలోని వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబ‌ర్-402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి వ‌చ్చారు. 

ఆయ‌న త‌న కారును అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేశాడు. గండ్ర నాగిరెడ్డి బ‌య‌ట నుంచి వ‌చ్చి త‌న కారును కృష్ణ కారు వెనక నిలిపాడు. కృష్ణ జివ్వాజి తిరిగి వెళ్లేందుకు కిందికి రాగా... త‌న కారుపై గీత‌లు క‌నిపించాయి. అందుకు నాగిరెడ్డి కార‌ణ‌మ‌ని, వాచ్‌మెన్‌తో అత‌డిని కిందికి ర‌ప్పించి దాడి చేశాడు. దాంతో నాగిరెడ్డి చెవిలోంచి ర‌క్తం, నోటిలోంచి నురుగ వ‌చ్చి ప‌డిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. 

అదే రోజు రాత్రి మృతుడి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నాగిరెడ్డి కింద‌ప‌డ‌గానే దాడి చేసిన కృష్ణ జివ్వాజి ప‌రార‌య్యాడు. కామాక్షి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. పోస్టుమార్టం అనంత‌రం కుటుంబ స‌భ్యులు నాగిరెడ్డి మృతదేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. కేసు గురించి మీడియాకు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో పాటు నిందితుడిని అరెస్టు చేయ‌క‌పోవ‌డాన్ని అపార్ట్‌మెంట్ వాసులు ప్ర‌శ్నించ‌డంతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.   


More Telugu News