క్రికెట్ మ్యాచ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మైదానంలో బంగ్లా, ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల బాహాబాహీ.. ఇదిగో వీడియో!

  • ఢాకాలో బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా ఎమ‌ర్జింగ్ జట్ల మ‌ధ్య మ్యాచ్‌
  • మైదానంలోనే గొడ‌వ‌కు దిగిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు
  • బంగ్లా బ్యాట‌ర్ రిపన్ మోండ‌ల్‌పై చేయిచేసుకున్న స‌ఫారీ బౌల‌ర్ షిపో నులి 
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్‌
ఢాకాలో బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా ఎమ‌ర్జింగ్ జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ప్లేయ‌ర్లు బాహాబాహీకి దిగారు. మైదానంలోనే ఇద్ద‌రు ఆట‌గాళ్లు గొడ‌వ‌కు దిగారు. బంగ్లా బ్యాట‌ర్ రిపన్ మోండ‌ల్‌పై ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌల‌ర్ షిపో నులి చేయిచేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

బంగ్లా బ్యాటర్‌కు స‌ఫారీ బౌల‌ర్ పంచ్ ఇవ్వ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు. దాంతో ఫీల్డ్ అంపైర్‌తో పాటు మిగతా ఆట‌గాళ్లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. బంగ్లా బ్యాట‌ర్‌పై మ‌రో సఫారీ ఫీల్డ‌ర్ కూడా దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డం వీడియోలో ఉంది. 

అస‌లేం జ‌రిగిందంటే..!
నులి బౌలింగ్‌లో రిప‌న్ వరుసగా సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఆ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు చూపులు విసురుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బౌలర్, బ్యాట‌ర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆ తర్వాత, రిపన్ తన బ్యాటింగ్ భాగస్వామి వైపు వెళ్లగానే, నులి బంగ్లా బ్యాట‌ర్‌ వైపు దూసుకెళ్లాడు. 

ఏదో మాట‌లు అనుకుని, ఒక‌ర్ని ఒక‌రు తోసేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆ గొడ‌వ పెద్ద‌గా మారింది. బ్యాట‌ర్ రిప‌న్ హెల్మెట్‌ను బౌల‌ర్ నులి లాగేశాడు. వెంట‌నే ఫీల్డ్ అంపైర్‌తో పాటు మిగతా ఆట‌గాళ్లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ఆట‌గాళ్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. మ్యాచ్ అధికారులు త్వ‌ర‌లో రిపోర్టును స‌మ‌ర్పించ‌నున్నారు. ప్లేయ‌ర్ల‌పై అధికారిక చర్య తీసుకునే ముందు, మ్యాచ్ రిఫరీ ఈ సంఘటన తాలూకు నివేదికలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) రెండింటికీ సమర్పిస్తాడు.


More Telugu News