Nadendla Manohar: ఏపీలో ఆదివారం కూడా రేషన్ షాపులు ఓపెన్

- జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ
- ప్రజల ఇబ్బందులు, బియ్యం స్మగ్లింగ్ నివారణకే ఈ నిర్ణయమన్న మంత్రి నాదెండ్ల
- పనులు మానుకుని రేషన్ వ్యాన్ల కోసం ఎదురుచూసే విధానానికి స్వస్తి
- ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచే ఉంటాయి
- వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు
- మార్కెట్‌లో ధరలు పెరిగితే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరఫరా
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో, లబ్ధిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని* రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
గురువారం నాడు విజయవాడలో రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
"ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తాం. ఈ పదిహేను రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులూ షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది" అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
గతంలో చాలామంది లబ్ధిదారులు పనిదినాల్లో రేషన్ తీసుకోలేక ఇబ్బందులు పడేవారని, ఆదివారం షాపులు తెరిచి ఉంచడం వల్ల అలాంటి సమస్యలకు తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి, వారాంతంలో మాత్రమే తీరిక దొరికే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో, వారి ఇళ్ల వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.