Shashi Tharoor: గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌పై శశిథరూర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా చురక

Shashi Tharoors Remarks on Surgical Strikes Draw Criticism
  • మోదీ సర్కార్ అనుకూల వ్యాఖ్యలతో వార్తల్లో శశి థరూర్
  • శశి థరూర్ తీరుపై కాంగ్రెస్‌లో అసంతృప్తి
  • గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన థరూర్ పుస్తక భాగం షేర్ చేసిన పవన్ ఖేడా
  • సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయాలకు వాడుకున్నారన్న థరూర్ పాత వ్యాఖ్యలు
  • థరూర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానంటూ పవన్ ఖేడా చురక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఇటీవల మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పవన్ ఖేడా గతంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని కొన్ని కీలక వాక్యాలను గుర్తుచేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌పై థరూర్ తన పుస్తకంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు పవన్ ఖేడా 'ఎక్స్' వేదికగా చురక అంటించారు.

పవన్ ఖేడా షేర్ చేసిన ఫొటోలో శశి థరూర్ గతంలో రాసిన పుస్తకంలోని పేరా ఉంది. అందులో "2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అంతకుముందు మయన్మార్‌లో తిరుగుబాటుదారులపై జరిగిన సైనిక చర్యను కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు" అని శశి థరూర్ విమర్శించినట్లు ఉంది.

ఈ పేరా ఫొటోను షేర్ చేస్తూ "ప్రస్తుతం నేను ఈ పుస్తకం చదువుతున్నాను. శశి థరూర్ గారూ మీరు చేసిన ఈ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను" అని పవన్ ఖేడా తన పోస్టులో రాసుకొచ్చారు.

ఇటీవల పనామాలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో శశి థరూర్ మాట్లాడుతూ 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తోనే భారత్ తొలిసారిగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు థరూర్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే తాను కేవలం ప్రస్తుత ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని గతంలో జరిగిన యుద్ధాల గురించి ప్రస్తావించలేదని శశి థరూర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ ఖేడా తాజాగా చేసిన పోస్ట్ ద్వారా గతంలో థరూర్ చేసిన విమర్శలను తెరపైకి తెచ్చారు.
Shashi Tharoor
Pawan Khera
Congress
Surgical Strikes
Modi Government
NDA Government

More Telugu News