లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఐటీ, ఆటో షేర్ల దన్ను!

  • వరుసగా రెండో రోజూ లాభాల పంట
  • సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్లు వృద్ధి
  • కీలకమైన 25 వేల మార్కును దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాలతో కళకళలాడాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు కూడా మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో నిఫ్టీ కీలకమైన 25 వేల మార్కును దాటింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 81,928.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. అంతకుముందు రోజు సూచీ 81,721.08 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా కొనుగోళ్ల ఉత్సాహం కొనసాగడంతో, ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 82,492.24 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. చివరకు, 455 పాయింట్ల లాభంతో 82,176 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 148 పాయింట్లు లాభపడి 25,001 పాయింట్ల వద్ద ముగిసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, యూరోపియన్ యూనియన్‌ (ఈయూ)తో వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 50 శాతం టారిఫ్‌ల అమలు వాయిదా పడింది. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న తాత్కాలిక అనిశ్చితి తగ్గింది. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించడంతో, దేశీయ సూచీలు కూడా రాణించాయి.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 35 పైసలు బలపడి 85.10 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు, ఎటర్నల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.75 డాలర్లుగా ఉండగా, బంగారం ధర ఔన్సుకు 3,332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


More Telugu News