టర్కీ టూర్‌లో ఇంగ్లండ్ మహిళ అనుమానాస్పద మృతి.. గుండె మాయం!

  • శవపరీక్షలో గుండె లేదని తేలడంతో కుటుంబ సభ్యుల ఆందోళన
  • వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని భర్త ఆరోపణ
  • టర్కీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి 
  • పెన్సిలిన్ అలర్జీ కారణమా? కొనసాగుతున్న దర్యాప్తు
ఇంగ్లండ్ నుంచి టర్కీకి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి అక్కడ అనుమానాస్పదస్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. యూకేలో నిర్వహించిన పోస్ట్‌మార్టంలో ఆమె ఛాతీలో గుండె లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ సంఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతూ, టర్కీ అధికారుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంగ్లండ్‌లోని పోర్ట్స్‌మౌత్‌కు చెందిన బెత్ మార్టిన్ (28) తన భర్త ల్యూక్ మార్టిన్, ఇద్దరు పిల్లలు ఎలోయిస్ (8), టామీ (5)లతో కలిసి ఏప్రిల్ 27న టర్కీకి విహారయాత్రకు బయలుదేరారు. విమాన ప్రయాణంలోనే బెత్ అస్వస్థతకు గురయ్యారు. మొదట ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని భావించారు. ఇస్తాంబుల్‌లో విమానం దిగిన కొన్ని గంటల్లోనే ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏప్రిల్ 28న ఆమె మరణించినట్టు 'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రచురించింది.

టర్కీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పలు అవయవాలు పనిచేయకపోవడం వల్ల గుండెపోటు రావడంతో బెత్ మార్టిన్ మరణించినట్టు తెలిపారు. అయితే, మరణానికి దారితీసిన కచ్చితమైన కారణాలను వారు స్పష్టంగా పేర్కొనలేదు. తన భార్య మృతి విషయంలో టర్కీ అధికారులు సరిగ్గా సహకరించలేదని, తొలుత తానే ఆమెకు విషప్రయోగం చేశానేమోనన్న కోణంలో తనను అనుమానించారని భర్త ల్యూక్ మార్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక ప్రయత్నాల తర్వాత బెత్ మృతదేహాన్ని యూకేకి తరలించగా అక్కడ శవపరీక్ష నిర్వహించిన బ్రిటిష్ కరోనర్లు (శవపరీక్ష అధికారులు) ఆమె శరీరంలో గుండె లేదన్న నిజాన్ని ల్యూక్ మార్టిన్‌కు తెలిపారు. దీంతో మార్టిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇస్తాంబుల్‌లోని మర్మారా యూనివర్సిటీ పెండిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం, టర్కీ అధికారుల విచారణ లోపాలు కారణమై ఉండవచ్చని బెత్ కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెకు పెన్సిలిన్ అలర్జీ ఉందని తెలియకుండానే అక్కడి వైద్య సిబ్బంది ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, బ్రిటిష్ కరోనర్ల ఆరోపణలను టర్కీ అధికారులు ఖండించారు. బెత్ మరణించిన ఆసుపత్రిలో తొలి పోస్ట్‌మార్టం సమయంలో ఆమెకు "ఎలాంటి శస్త్రచికిత్సలు జరగలేదని" వారు స్పష్టం చేశారు. మరణానికి ముందు తన భార్యను బలవంతంగా పడుకోబెట్టి, అనేక రకాలుగా హింసించారని, చివరి గంటల్లో ఏం జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ల్యూక్ మార్టిన్ ఆరోపించారు. ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో వ్యాన్‌లో సాయుధ పోలీసులు తనను విచారించి, నిందితుడిగా చిత్రీకరించి మానసికంగా వేధించారని ఆయన పేర్కొన్నారు.

బెత్ మార్టిన్ పేరుతో ఏర్పాటు చేసిన గోఫండ్‌మీ పేజీ ద్వారా 2,50,000 పౌండ్ల (సుమారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు) నిధులు సమీకరించాలని లక్ష్యంగా ల్యూక్ మార్టిన్ పెట్టుకున్నారు. ఆమె అవయవాలు అకస్మాత్తుగా ఎందుకు విఫలమయ్యాయో తెలుసుకోవడానికి ఇంగ్లండ్‌లోని కరోనర్లకు ఆరు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News