ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన నిర్మాత నాగ‌వంశీ

  • ఏపీ ప్రభుత్వంపై సినీ పరిశ్ర‌మలోని వారెవ‌రికీ కనీస మర్యాద, కృతజ్ఞత లేద‌న్న ప‌వ‌న్‌
  • డిప్యూటీ సీఎం వ్యాఖ్య‌ల‌పై ఎక్స్ వేదిక‌గా స్పందించిన నాగ‌వంశీ
  • బుద్ధి వాడితే ఈ సమస్య వచ్చేది కాదన్న నిర్మాత
  • ఇండస్ట్రీ పెద్దలకు నాగ‌వంశీ ఇన్‌డైరెక్ట్ కౌంటర్
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటుంటే.. వారికి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదన్నారు. 

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా సినీ పెద్దలు సీఎం చంద్రబాబును కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవలేదన్నారు. కేవలం తమ చిత్రాలు విడుదల అవుతున్న సమయంలో ముందుకు రావడం మినహా చిత్ర పరిశ్రమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇప్ప‌టికే స్పందించారు. తాజాగా మ‌రో నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఎక్కడా పవన్ గురించి గానీ, థియేటర్ల బంద్ అంశంపై గాని నేరుగా ప్రస్తావించని ఆయన.. చురకలు మాత్రం బాగా అంటించారు. 

"అవసరమైన చోట దృష్టి పెట్టాల్సిన‌ స‌మ‌యంలో అనవసరమైన సమస్యల‌ను సృష్టించారు. ఇప్పుడు అవి మ‌రింత పెద్దవ‌య్యాయి. బుద్ధి ప్రధాన పాత్ర పోషించి ఉంటే ఈ సమస్యలను చాలా సులభంగా నివారించి ఉండేవారు" అంటూ నాగవంశీ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇండస్ట్రీ పెద్దలకు నాగ‌వంశీ ఇన్‌డైరెక్ట్ గా ఇలా కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు. 


More Telugu News