ఓటీటీలోకి 'హిట్ 3'... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే..?

  • నాని, శైలేశ్‌ కొలను కాంబినేష‌న్‌లో 'హిట్ 3'
  • మేడే కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా
  • మే 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న మూవీ
నేచుర‌ల్ స్టార్‌ నాని, శైలేశ్‌ కొలను కాంబినేష‌న్‌లో 'హిట్ 3' చిత్రం మే 1న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్ కు మాత్రం 'హిట్ 3' చిత్రం మాంచి కిక్ ఇచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ 3 సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 100 కోట్ల మార్క్‌ను అవ‌లీల‌గా దాటేసింది. 

ఇక‌, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్న‌ వారికి  చిత్ర బృందం తీపి క‌బురు చెప్పింది. 'హిట్ 3' రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో రాబోతోంది. మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ చేయబోతున్న‌ట్టు తెలియ‌జేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా... నాని స‌ర‌స‌న హీరోయిన్‌గా క‌న్న‌డ భామ, కేజీఎఫ్ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.

ఇదిలాఉంటే... ఈ మధ్య నాని వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న విష‌యం విదిత‌మే. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం', 'హిట్ 3' ఇలా మంచి ప్రాజెక్టులతో నేచుర‌ల్ స్టార్‌ హిట్లు కొడుతున్నారు. ప్ర‌స్తుతం నాని త‌న‌కు 'ద‌స‌రా' లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరింత రా అండ్ రస్టిక్ 'ది ప్యారడైజ్' మూవీని చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌కుడు సుజిత్‌తో మ‌రో చిత్రం చేయ‌నున్నారు. 


More Telugu News