Nara Lokesh: మంత్రి లోకేశ్ పనితీరు పట్ల ఏపీ హైకోర్టు ప్రశంసలు!

Nara Lokesh Praised by AP High Court for Performance
  • కేజీబీవీ సమస్యలపై వేగంగా స్పందించడంపై ధర్మాసనం అభినందన
  • అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం
  • మంత్రికి, ప్రభుత్వానికి అధికారులు చెడ్డపేరు తెస్తున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై హైకోర్టు ప్రశంసలు కురిపించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) సమస్యలపై మంత్రి వేగంగా స్పందిస్తున్నారని అభినందించింది. అయితే, అదే సమయంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి చురుగ్గా పనిచేస్తున్నా, అధికారులు ఆయనకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. 

కేజీబీవీలకు సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని ఓ కేజీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేష్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. అలాగే, కేజీబీవీ టీచర్ల జీతాల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీకి కృషి చేస్తామని మంత్రి ప్రకటించడాన్ని సానుకూల చర్యగా పేర్కొంది. 

అయితే, మంత్రి స్థాయిలో అంత వేగంగా స్పందన ఉంటే, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సర్వశిక్షా అభియాన్ (SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్‌పై కూడా కోర్టు అసంతృప్తిని తెలియజేసింది. కొత్తగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Nara Lokesh
AP High Court
Andhra Pradesh Education
Kasturba Gandhi Balika Vidyalaya
KGBV Schools
Education Department AP
Court Defiance Case
Sarva Shiksha Abhiyan
Srinivasa Rao SSA
AP Education System

More Telugu News