ఆగని నెత్తుటి ప్రవాహం.. నాలుగో ఏట అడుగుపెట్టిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

Russia Ukraine War Enters Fourth Year
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మంగళవారంతో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ పోరు ఇప్పుడు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ముగింపు కనిపించని ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వాణిజ్య అస్థిరతకు కారణమవుతూనే ఉంది. ఇది మన సామూహిక స్పృహపై పడిన మరక అని, అంతర్జాతీయ శాంతికి ముప్పుగా మిగిలిపోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మూడేళ్లలో 15,000 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 41,000 మంది గాయపడ్డారు. యుద్ధం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 660 మంది చిన్నారులు మరణించగా, దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ఈ పోరులో 3.25 లక్షల మంది రష్యా సైనికులు, 1.40 లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు.

2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చని ఆయన భావించినప్పటికీ, ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతుండగా, దాదాపు 20 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. "మేం మా స్వాతంత్ర్యాన్ని కాపాడుకున్నాం, పుతిన్ లక్ష్యాలు నెరవేరలేదు" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ యుద్ధంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. అమెరికా సుమారు 175 బిలియన్ డాలర్లు, ఈయూ 230 బిలియన్ డాలర్ల సహాయం చేశాయి. మరోవైపు, అమెరికా చొరవతో శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. జెనీవాలో జరిగిన తాజా చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అయితే, శాంతి ఒప్పందానికి కొన్ని కీలక అంశాలు అడ్డంకిగా మారాయి. డాన్‌బాస్ ప్రాంతంతో సహా తాము ఆక్రమించుకున్న భూభాగాలను వదులుకోవాలని, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై నియంత్రణ కావాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే, తమ భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. దీంతో ఇరుపక్షాల మధ్య పీటముడి వీడటం లేదు.
Go Back to Shorts
Russia Ukraine War
Ukraine
Russia
Volodymyr Zelenskyy
Vladimir Putin
Donbas
Zaporizhzhia
NATO
Europe
Military Conflict

More Telugu News