Haveri Gang Rape Case: కార్ల ర్యాలీతో గ్యాంగ్ రేప్ నిందితుల సంబరాలు.. వీడియో ఇదిగో!

Haveri Gang Rape Case Accused Celebrate Bail with Car Rally
  • హవేరి గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్..
  • బైక్ లు, కార్లతో విజయోత్సవ ర్యాలీ.. కర్ణాటకలో షాకింగ్ ఘటన
  • నిందితుల సంబరాలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం
కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు బెయిల్ లభించడం, ఆ తర్వాత వారు భారీ ఊరేగింపు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సుమారు 16 నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురు ప్రధాన నిందితులకు హవేరి సెషన్స్ కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.

వివరాల్లోకి వెళితే.. హవేరి జిల్లాలో 2024 జనవరి 8న ఓ మతాంతర జంట హోటల్ గదిలో ఉండగా, కొందరు వ్యక్తులు వారిపై దాడి చేశారు. మహిళను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సవికేరి అనే ఏడుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల వీరికి బెయిల్ లభించడంతో, హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణంలో బైక్‌లు, కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. నిందితులు నవ్వుతూ, విజయ సంకేతాలు చూపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

నిందితులను గుర్తించలేకపోయిన బాధితురాలు..
ఈ ఘటనను తొలుత మోరల్ పోలీసింగ్ కేసుగా నమోదు చేశారు. బాధితురాలు, కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్ అయిన తన భాగస్వామితో కలిసి హోటల్‌లో ఉండటమే దీనికి కారణం. అయితే, జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గ్యాంగ్ రేప్ సెక్షన్లను చేర్చారు. విచారణ సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. ఇది ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరిచిందని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 19 మందిని అరెస్ట్ చేయగా, వీరిలో 12 మందికి సుమారు పది నెలల క్రితమే బెయిల్ లభించింది. మిగిలిన ఏడుగురు ప్రధాన నిందితులకు పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు, తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Haveri Gang Rape Case
Karnataka gang rape
Haveri
Moral policing
Crime news
India crime
Gang rape accused
Bail granted
Accused rally

More Telugu News