మద్యం మత్తులో నెల రోజుల పసిబిడ్డపై పడుకున్న తండ్రి.. ఊపిరాడక మృతి

  • నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం
  • భార్య, చిన్నారి నిద్రపోతున్న మంచంపైనే పడుకున్న తండ్రి
  • కాసేపటి తర్వాత చిన్నారి ముక్కు నుంచి రక్తం
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి 
నిర్మల్ జిల్లాలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడిగా మారి నెల రోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యాడు. మద్యం మత్తులో ఉన్న అతడు చేసిన నిర్వాకానికి పసిపాప ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. చీమన్‌పల్లి గ్రామానికి చెందిన అలకుంట శేఖర్ (22) వృత్తిరీత్యా కూలీ. సుజాత అనే మహిళతో వివాహమైంది. సుజాత 28 రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం ఆమె సుభాష్ నగర్‌లోని తన తల్లిగారింట్లోనే ఉంటోంది.

మంగళవారం తెల్లవారుజామున శేఖర్ మద్యం మత్తులో అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అతని భార్య సుజాత, వారి 28 రోజుల పసిపాప మంచంపై నిద్రిస్తున్నారు. భార్య, బిడ్డ మంచంపై ఉన్నారని తెలిసినప్పటికీ, శేఖర్ మద్యం మత్తులో అదే మంచంపై వారి పక్కనే పడుకున్నాడు. ఈ క్రమంలో నిద్రమత్తులో అతడు పసికందుపై పడిపోయినట్లు తెలుస్తోంది.

కొంతసేపటి తర్వాత పసికందు ముక్కు నుంచి రక్తం కారడం గమనించిన సుజాత, ఆమె తల్లి రాజమణి ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాపను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పసికందు ఊపిరాడకపోవడం వల్లే మరణించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై సుజాత తల్లి రాజమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు సుజాతను, పసిబిడ్డను తమ ఇంటికి తీసుకెళ్తానని శేఖర్ తరచూ తమతో గొడవ పడేవాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. మద్యం తాగి వచ్చి వేధించేవాడని తెలిపారు. రాజమణి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శేఖర్‌‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News