ఆమె ఎవరో కానీ నా హృదయాన్ని వెలిగించింది: నరేశ్

  • హైదరాబాద్ విమానాశ్రయంలో నరేశ్, పవిత్రలకు ఓ అద్భుతమైన అనుభవం
  • ఓ అపరిచిత మహిళ వారిని కలిసి స్వీట్లు బహూకరించిన వైనం
  • పవిత్రను "అమ్ము" అని పిలవడం తనను కదిలించిందని మహిళ వెల్లడి
  • నరేశ్ మంచి వ్యక్తి అని, పవిత్ర అదృష్టవంతురాలని కొనియాడిన మహిళ
  • ఆమె మాటలు, చిత్తశుద్ధి జీవితాంతం గుర్తుండిపోతాయన్న నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేశ్‌లకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ అరుదైన, మధురమైన అనుభవం ఎదురైంది. ఓ అపరిచిత మహిళ వారి వద్దకు వచ్చి, వారి అన్యోన్యతను ప్రశంసిస్తూ కొన్ని మాటలు చెప్పి, స్వీట్లు ఇచ్చి వెళ్లిన ఘటన తమను ఎంతగానో కదిలించిందని నరేశ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె ఎవరో కానీ తన మాటలతో నా హృదయాన్ని కాంతివంతం చేసింది అని పేర్కొన్నారు.

నరేశ్, పవిత్రా లోకేశ్ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఓ మహిళ వారి వద్దకు వచ్చారు. ఆమె నరేశ్‌తో మాట్లాడుతూ, "మీరు పవిత్ర గారిపై చూపించే శ్రద్ధ, ప్రేమ, ముఖ్యంగా ఆమెను 'అమ్ము' అని పిలిచే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీరు చాలా మంచివారు (జెంటిల్‌మన్). ఆమె మిమ్మల్ని పొందడం అదృష్టం, అలాగే మీరు ఆమెను పొందడం కూడా అదృష్టమే. బయట సమాజంలో పరిస్థితులు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయని నాకు తెలుసు... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అని అన్నారని నరేశ్ పేర్కొన్నారు.

ఆ మహిళ ఎవరో తమకు తెలియదని, ఆమె తమకు కొన్ని స్వీట్లు కూడా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారని నరేశ్ తెలిపారు. "ఆమె ఎవరో మాకు తెలియదు. కానీ, ఆమె మాటల్లోని నిజాయతీ, ముఖంలో కనిపించిన చిత్తశుద్ధి అన్నీ చెప్పేశాయి. ఆమె ఎవరో కానీ, మా జీవితాంతం గుర్తుండిపోతారు. ఇది మా జీవితాల్లో అత్యంత కదిలించిన క్షణం. మీకు చాలా ధన్యవాదాలు" అంటూ నరేశ్ తన పోస్ట్‌లో భావోద్వేగానికి గురయ్యారు.




More Telugu News