హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

  • కుంట్లూరు వద్ద డీసీఎంను ఢీకొన్న కారు
  • ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
  • మరొకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌ మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు, డీసీఎం వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒక మలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు వేగంగా ఢీకొన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.


More Telugu News