Pakistan Security Official: సరిహద్దుల్లో సైన్యం ఉపసంహరణపై పాకిస్థాన్ అధికారి ఏమన్నారంటే..?

- సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు భారత్, పాక్ అంగీకారించాయని వెల్లడి
- మే నెలాఖరు కల్లా ప్రక్రియ పూర్తి కానుందని వెల్లడి
- ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో మోహరించిన అదనపు బలగాలు వెనక్కి!
- కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి దశలవారీగా ఉపసంహరణ ఉంటుందని వెల్లడి
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరుదేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు సైనిక బలగాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు పాకిస్థాన్‌కు చెందిన ఒక సీనియర్ భద్రతా అధికారి మంగళవారం ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వెల్లడించారు.
గత నెలలో పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ ఆరోపించగా, ఇస్లామాబాద్ ఈ ఆరోపణలను ఖండించింది. అనంతరం ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్లు, క్షిపణులు, వైమానిక దాడులు, ఫిరంగి దాడులతో ఇరుపక్షాలు పరస్పరం దాడులకు దిగాయి. ఆ తర్వాత అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించడంతో ఈ ఘర్షణలకు తెరపడింది. ప్రస్తుతం ఈ కాల్పుల విరమణ కొనసాగుతోంది.
"సంఘర్షణకు ముందున్న స్థానాలకు మే నెలాఖరు కల్లా బలగాలను ఉపసంహరిస్తారు" అని సదరు పాకిస్థానీ సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. మీడియాతో మాట్లాడే అధికారం లేనందున ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ప్రధానంగా కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి మోహరించిన అదనపు బలగాలను, ఆయుధాలను దశలవారీగా ఉపసంహరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు ఆయన వివరించారు.
సరిహద్దులు, ముందున్న ప్రాంతాల నుంచి సైనిక బలగాల తగ్గింపునకు తక్షణ చర్యలు తీసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు భారత సైన్యం గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. "ఈ చర్యలన్నింటినీ మొదట 10 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక వేశాం. కానీ కొన్ని చిన్న సమస్యల వల్ల జాప్యం జరిగింది" అని పాకిస్థానీ అధికారి తెలిపారు.