ఇది ఉక్రెయిన్ భాషలో రూపొందిన హారర్ థ్రిల్లర్. ఆగస్టు 22 .. 2024లో ఈ సినిమా అక్కడ విడుదలైంది. ఆండ్రీ కొలెస్నీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిందీలో జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటు నాలుగు భాషలలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఉక్రెయిన్ లోని 'కోనోటాప్' నగరానికి చెందిన ఆండ్రీ - ఒలేనా చాలా కాలం నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే రష్యా వైపు నుంచి యుద్ధ మేఘాలు అలుముకుంటాయి. రష్యా సైనికులు అన్ని వైపుల నుంచి దాడులు మొదలుపెడతారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆండ్రీ - ఒలేనా బయటపడాలనుకుంటారు.
రష్యా ఆర్మీ కంటపడకుండా తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో రష్యా సైనికులు వాళ్లను అడ్డుకుంటారు. ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా వాళ్లిద్దరిపై కాల్పులు జరుపుతారు. ఒలేనాను ఒక సురక్షిత ప్రదేశానికి చేర్చిన ఆండ్రీ, అప్పటికే బుల్లెట్ కారణంగా అయిన గాయాల వలన మరణిస్తాడు. అతనితో గడిపిన క్షణాలను తలచుకుని ఒలేనా కుమిలిపోతుంది.
ఆండ్రీ మరణానికి కారకులైన రష్యా సైనికులను అంతం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం గతంలో తనకి తెలిసిన తాంత్రిక శక్తులను ఆశ్రయించాలని భావిస్తుంది. ఒలేనా తాంత్రిక శక్తులను తిరిగి పొందడం వలన రష్యా సైనికులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆమె కోరిక నెరవేరుతుందా? అనేది కథ.
విశ్లేషణ: యుద్ధం నేపథ్యంలో సాగే కథలు .. దుష్ట శక్తుల నేపథ్యంలో రూపొందిన సినిమాలు చాలానే వచ్చాయి. ఈ రెండు అంశాలను కలుపుతూ తెరకెక్కించిన సినిమా ఇది. శత్రు సైనికులపై క్షుద్రశక్తులను ప్రయోగించడమనేది ఈ కథలోని కొత్త అంశంగా కనిపిస్తుంది.
తాను ప్రేమించిన వ్యక్తిని హతమార్చిన శత్రుసైనికులపై, ఒక మంత్రగత్తె తీర్చుకునే ప్రతీకారం అనే లైన్ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక వైపున యాక్షన్ సన్నివేశాలు .. మరోవైపున మాయలు - మంత్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అనుకోవడం సహజం. అలాంటి ఊహలకు చాలా దూరంలో కనిపించే కంటెంట్ ఇది.
శత్రు సైనికులపై క్షుద్ర మంత్రాలను ప్రయోగించడం .. సైనికులను చంపుతూ వెళ్లడం ఏ మాత్రం ఆసక్తికరంగా .. చూడదగినవిగా ఉండవు. విపరీతమైన హింస - రక్తపాతాలతో, చూడటానికి జుగుప్స కరమైన దృశ్యాలతో ఈ కథ నడుస్తుంది. సాధారణమైన ప్రేక్షకులు చూడలేని కంటెంట్ ఇది.
పనితీరు: దేశాల మధ్య యుద్ధం .. శత్రు దేశానికి చెందిన సైనికులను ఓ మంత్రగత్తె చంపడం అనే లైన్ ను ఎంచుకోవడం వరకూ కొత్తగానే అనిపిస్తుంది. కానీ అందుకోసం రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించలేకపోగా, అసహనాన్ని కలిగిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం.. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
ముగింపు: శత్రు సైనికుల ఆగడాలు .. తాంత్రిక పూజలకు సంబంధించిన దృశ్యాలను కుతూహలాన్ని రేకెత్తించేలా చిత్రీకరించవచ్చు. కానీ దర్శకుడు అత్యంత జుగుప్స కరమైన దృశ్యాలను తెరపైకి తీసుకుని వచ్చాడు. హింస - రక్తపాతంతో పాటు, శృంగార పరమైన దృశ్యాలు కూడా ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.
'ది విచ్ రివేంజ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews

The Witch Revenge Review
- ఉక్రెయిన్ లో రూపొందిన సినిమా
- రష్యా దాడుల నేపథ్యంలో నడిచే కథ
- 2024లో విడుదలైన సినిమా
- జుగుప్స కరమైన దృశ్యాలతో ఇబ్బంది పెట్టే కంటెంట్
Movie Name: The Witch Revenge
Release Date: 2025-05-16
Cast: Tetiana, Taras Tsymbaliuk, Olena Khokhlatkina,Pavlo
Director: Andriy Kolesnyk
Music: Oleksantyn
Banner: Film UA
Review By: Peddinti