వర్ష బీభత్సం.. నీట మునిగిన బెంగ‌ళూరు

  • ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వ‌ర‌కు భారీ వర్షం 
  • ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతం అంటున్న‌ నగర వాసులు 
  • సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌, హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఅవుట్‌, బొమ్మనహళ్లిలను ముంచెత్తిన వర్షం
టెక్‌ నగరం బెంగళూరులో వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వ‌ర‌కు భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు ఆరు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. 

లోతట్టు ప్రాంతాలు జ‌లాశ‌యాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగర వాసులు చెబుతున్నారు. నగరంలో వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్య‌మాల‌ ద్వారా షేర్‌ చేస్తున్నారు. 

ప్రసిద్ధ సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌, హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఅవుట్‌, బొమ్మనహళ్లిలను వర్షం ముంచెత్తింది. మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 

కాగా, నిన్న కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతం నమోదైన‌ట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్ల‌డించింది. అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లి 131.5 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీట‌ర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.


More Telugu News