స‌న్‌రైజ‌ర్స్ స్టార్ ప్లేయ‌ర్‌కు క‌రోనా.. నేటి ల‌క్నోతో మ్యాచ్‌కు దూరం

  • ఈరోజు ఎల్ఎస్‌జీతో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌
  • కరోనా బారినపడ్డ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 
  • దీంతో ల‌క్నో మ్యాచ్‌కు దూరం కానున్నాడ‌ని కోచ్ వెటోరి వెల్ల‌డి
ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ రేసు నుంచి త‌ప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)కు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఎస్ఆర్‌హెచ్‌ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి ఈ విషయాన్ని వెల్లడించాడు. 

క‌రోనా బారినపడడంతో హెడ్ భారత్‌కు రావడంలో ఆలస్యమవుతుందని కోచ్ తెలిపాడు. క‌రోనా సోక‌డంతో ప్రయాణించలేకపోయాడని తెలిపాడు. అయితే, హెడ్‌కు ఎప్పుడు.. ఎక్కడ కరోనా వైర‌స్ సోకిందనే విషయాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. సోమవారం ఉదయం భారత్‌కు చేరుకుంటాడని.. వైద్య సిబ్బంది అతన్ని పరీక్షిస్తారని ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తామని వెటోరి చెప్పాడు.

ఇదిలాఉంటే.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ వారం పాటు వాయిదా పడింది. హెడ్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. జూన్‌ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇద్దరు మళ్లీ ఐపీఎల్‌లో చేరుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మిగతా మ్యాచుల కోసం హెడ్‌, కమిన్స్‌ ఇద్దరూ భారత్‌కు వస్తారని సన్‌రైజర్స్‌ జట్టు యాజమాన్యం ధ్రువీక‌రించింది. 

ఇక‌, సన్‌రైజర్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన విష‌యం తెలిసిందే. మే 25న చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్‌సీబీ, కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా, ట్రావిస్‌ హెడ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 11 మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు. గత సీజన్‌లో 15 మ్యాచుల్లో 567 పరుగులు చేయగా.. ఈసారి మాత్రం పెద్దగా రాణించ‌లేకపోయాడు.


More Telugu News