పాక్‌తో కాల్పుల విర‌మణ ఒప్పందానికి సంబంధించి భార‌త ఆర్మీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • ఈరోజుతో సీజ్‌ఫైర్ ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను ఖండించిన భార‌త ఆర్మీ
  • ఇరు దేశాల డీజీఎంఓల మధ్య ఇవాళ ఎలాంటి చ‌ర్చ‌ల్లేవ‌ని వెల్ల‌డి 
  • కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌కు ముగింపు తేదీ లేద‌ని ప్ర‌క‌టన‌
పాకిస్థాన్‌తో కాల్పుల విర‌మ‌న ఒప్పందానికి సంబంధించి తాజాగా భార‌త ఆర్మీ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈరోజుతో సీజ్‌ఫైర్ ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను ఖండించింది. ఇండియా, పాకిస్థాన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ (డీజీఎంఓ)ల మధ్య ఇవాళ ఎలాంటి చ‌ర్చ‌ల‌కు ప్లాన్ చేయ‌లేద‌ని తెలిపింది. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌కు ముగింపు తేదీ లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యాలే ప్ర‌స్తుతానికి కొన‌సాగుతాయ‌ని ఇండియ‌న్ ఆర్మీ స్ప‌ష్టం చేసింది.

ఇక‌, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌తో దాయాది పాకిస్థాన్ వ‌ణికిపోయిన విష‌యం తెలిసిందే. ఎదురుదాడికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ భార‌త బ‌ల‌గాల దెబ్బ‌కు తోక‌ముడిచింది. చివ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించాల‌ని దాయాది దేశం కాళ్ల బేరానికి రావ‌డంతో భార‌త్ అంగీక‌రించింది. దాంతో కాల్పుల విర‌మ‌ణ అమ‌ల్లోకి వ‌చ్చింది. వీటికి సంబంధించి మే 12న ఇరు దేశాల డీసీఎంఓల స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌ను కొన‌సాగించేందుకు మొగ్గు చూపిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.    


More Telugu News