వరుణుడి ఎఫెక్ట్... టాస్ కూడా పడకుండానే రద్దయిన ఐపీఎల్ రీస్టార్ట్ మ్యాచ్

  • ఐపీఎల్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు
  • బెంగళూరులో వర్షం కారణంగా ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు
  • మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు 
భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025, తొమ్మిది రోజుల అనంతరం పునః ప్రారంభం కావడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌ను ఆనందంగా తిలకించవచ్చని ఆశించిన అభిమానుల ఆశలను వర్షం నీరుగార్చింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింటును కేటాయించారు.

మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. ఆ అంచనాకు తగ్గట్టుగానే సాయంత్రం నుంచి వర్షం ప్రారంభమైంది. మొదట చిన్న జల్లులతో మొదలైన వర్షం ఆ తర్వాత తీవ్రరూపం దాల్చింది. కొంతసేపు వరుణుడు శాంతించడంతో మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, మరి కాసేపటికే వర్షం మళ్లీ మొదలైంది.

వర్షం తగ్గితే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఉత్సాహంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. 


More Telugu News