మీ భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా? అంటే విజయ్ దేవరకొండ ఏం చెప్పారంటే..!

  • 'లైగర్‌' సినిమా తర్వాత చాలా మార్పు వచ్చిందన్న విజయ్‌ దేవరకొండ
  • పూరీ జగన్నాథ్‌తో హిట్‌ కొట్టలేకపోవడం బాధగా ఉందని వ్యాఖ్య
  • నాగ్‌ అశ్విన్‌ తనను లక్కీ స్టార్‌గా భావిస్తాడని వెల్లడి
  • రష్మిక మంచి వ్యక్తి, అందమైన నటి అని ప్రశంస
ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ త్వరలో 'కింగ్‌డమ్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ 'ఫిలింఫేర్‌' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'లైగర్‌' సినిమా అనుభవాలు, వ్యక్తిగత జీవితం, తోటి నటీనటులు, దర్శకులతో తనకున్న అనుబంధం గురించి విజయ్‌ మనసు విప్పారు.

లైగర్ సినిమా ఎన్నో నేర్పింది

'లైగర్‌' సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంపై విజయ్‌ దేవరకొండ స్పందించారు. "దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలన్నది నా కల. 'లైగర్‌'తో ఆ కోరిక తీరింది. కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కానీ, మేము ఆశించిన ఫలితం రాలేదు. మా కాంబినేషన్‌లో ఒక హిట్‌ సినిమా రాకపోవడం నిజంగా బాధ కలిగించింది" అని అన్నారు. అయితే, ఆ సినిమా తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.

కొంతమంది దర్శకులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని విజయ్‌ గుర్తుచేసుకున్నారు. "నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్‌ భాస్కర్‌లతో నాకు మంచి స్నేహం ఉంది. వాళ్ల విజయాలను నా విజయాలుగా భావించి సంబరాలు చేసుకుంటాను. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను ఏదో ఒక రూపంలో భాగమయ్యాను. ఆయన నన్ను తన లక్కీ స్టార్‌గా అనుకుంటాడు. నాకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడు ఆయనే. ఆయనతో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాగ్‌ అశ్విన్‌ చాలా మంచి వ్యక్తి" అని విజయ్‌ పేర్కొన్నారు.

రష్మిక మంచి నటి

సహనటి రష్మిక మందన్న గురించి ప్రస్తావిస్తూ, "రష్మికతో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి, అందమైన నటి" అని అన్నారు. పెళ్లి గురించి అడగ్గా, "ప్రస్తుతానికి జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. కానీ, ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను" అని స్పష్టం చేశారు. మీ జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు, "మంచి మనసున్న అమ్మాయి అయితే చాలు" అని విజయ్‌ బదులిచ్చారు.


More Telugu News