ఇండియ‌న్ ఆర్మీకి థాంక్యూ చెప్పిన‌ క‌మిన్స్.. ఆరెంజ్ ఆర్మీ మీ పట్ల గర్విస్తోందంటూ కావ్య మార‌న్ పోస్ట్!

  • ఇన్‌స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్  
  • భార‌త‌ ఆర్మీకి ధ‌న్య‌వాదాలు చెబుతూ ఐపీఎల్ కెప్టెన్ల చిత్రాల‌తో కూడిన‌ పోస్ట‌ర్‌ను పంచుకున్న‌ క‌మిన్స్
  • ఇండియ‌న్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చూపిన తెగువ స్ఫూర్తిదాయ‌కమ‌న్న పాట్ క‌మిన్స్‌
  • అతని ఇన్‌స్టా స్టోరీని త‌న 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసిన కావ్య మార‌న్
ఐపీఎల్ ఫ్రాంచైజీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) కెప్టెన్ పాట్ క‌మిన్స్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ఇండియ‌న్ ఆర్మీకి ధ‌న్య‌వాదాలు చెబుతూ ఐపీఎల్ కెప్టెన్ల చిత్రాల‌తో బీసీసీఐ రూపొందించిన పోస్ట‌ర్‌ను క‌మిన్స్ త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. 

"కృత‌జ్ఞ‌తాభావంతో కోట్లాది హృద‌యాలు మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యాయి. ఇండియ‌న్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చూపిన తెగువ స్ఫూర్తిదాయ‌కం. థాంక్యూ" అని క‌మిన్స్ రాసుకొచ్చాడు. అత‌డి ఇన్‌స్టా స్టోరీని స‌న్‌రైజ‌ర్స్ య‌జ‌మానురాలు కావ్య మార‌న్ త‌న‌ 'ఎక్స్' హ్యాండిల్‌ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 

"భారత సైన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ... ఆరెంజ్ ఆర్మీ మీ పట్ల గర్వంగా ఉంది" అని కావ్య క్యాప్ష‌న్ ఇచ్చారు. దీంతో ఇప్పుడీ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. భార‌త క్రికెట్ అభిమానులు క‌మిన్స్‌ను ప్ర‌శంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలాఉంటే... ఈసారి ఐపీఎల్ సీజ‌న్‌లో సన్‌రైజ‌ర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన ఆరెంజ్ ఆర్మీ ఆ త‌ర్వాత పూర్తిగా తేలిపోయింది. అన్ని విభాగాల‌లో ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచులాడి కేవ‌లం మూడింట గెలిచిన ఎస్ఆర్‌హెచ్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్ర‌మించింది. 


More Telugu News