చంద్రబాబు నిజాయతీగా ఇళ్లు నిర్మించుకున్నారు... మీలా బెదిరించి వసూలు చేసిన డబ్బుతో కాదు: మంత్రి సుభాష్

  • చంద్రబాబుపై వైసీపీ విమర్శలు
  • తెలియకుండా ఇంకెన్ని ఆస్తులు కూడబెట్టారోనంటూ ట్వీట్ 
  • 11 సీట్లు ఇచ్చినా మీ వక్రబుద్ధి మారలేదన్న మంత్రి సుభాష్
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై వైసీపీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చేసిన ఆరోపణలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు నిజాయతీగా వ్యాపారం చేసి, సక్రమంగా పన్నులు చెల్లించి సంపాదించిన సొమ్ముతోనే ఇళ్లు నిర్మించుకున్నారని స్పష్టం చేశారు. మీలాగా, వ్యాపారం చేసుకునే వాళ్ళని బెదిరించి వసూలు చేసిన డబ్బులతో కాదు అని వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రజలు మీ దరిద్రం పోతుంది అని 11 సీట్లు ఇచ్చారు... కానీ మీ వక్ర బుద్ధి మాత్రం మారలేదు" అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

అంతకుముందు వైసీపీ చంద్రబాబుపై విమర్శలు చేసింది. చంద్రబాబు రెండు ఎకరాల ఆస్తితో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక మహల్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించింది. కుప్పంలో మరో భారీ మహల్ నిర్మాణం మొదలుపెట్టారని, ఇప్పుడు తాజాగా అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల విస్తీర్ణంలో మరో భారీ రాజమహల్ నిర్మిస్తున్నది మీరు కాదా?" అని వైసీపీ ప్రశ్నించింది. ఆయన రాజమహల్ లాంటి భవనాల్లో నివసిస్తూ, ప్రజల ముందు మాత్రం తాను నిరుపేదనని, పూరి గుడిసెలో ఉంటున్న వ్యక్తిలా మాట్లాడతారని వైసీపీ ఎద్దేవా చేసింది.




More Telugu News