యూఏఈలో ట్రంప్‌కు అసాధారణ స్వాగతం.. వెంట్రుకలు ఎగరేస్తూ నృత్యం.. వీడియో ఇదిగో!

  • యూఏఈలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన
  • అల్ అయలా సంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం
  • మహిళలు తల వెంట్రుకలు వేగంగా కదిలిస్తూ ప్రత్యేక నృత్యం 
  • స్వాగత కార్యక్రమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ఖతార్ పర్యటన ముగించుకుని యూఏఈకి విచ్చేసిన ఆయనకు దేశాధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అబుదాబిలోని అధ్యక్ష భవనం ఖసర్ అల్ వతన్‌లో ట్రంప్‌కు అందించిన ప్రత్యేక సాంస్కృతిక స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 స్వాగత దృశ్యాలు వైరల్
ఖసర్ అల్ వతన్‌కు చేరుకున్న ట్రంప్‌ను యూఏఈ, ఒమన్‌ దేశాలకు చెందిన సంప్రదాయ అల్ అయలా నృత్యంతో ఆహ్వానించారు. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళలు తమ పొడవాటి జుట్టును లయబద్ధంగా అటూ ఇటూ వేగంగా కదిలిస్తూ నృత్యం చేశారు. వైట్‌హౌస్ సహాయకురాలు మార్గో మార్టిన్ ‘ఎక్స్’లో పంచుకున్న వీడియోలో, డ్రమ్స్ వాయిద్యాలు, పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తుండగా ట్రంప్ వారిని చూస్తూ నిలబడి ఉన్నారు. ఈ ప్రదర్శనలో కొందరు పురుషులు కత్తుల వంటి వస్తువులను ఊపుతూ కనిపించారు. ‘యూఏఈలో స్వాగత కార్యక్రమం కొనసాగుతోంది!’ అంటూ మార్టిన్ ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే 5.3 మిలియన్లకు పైగా వీక్షణలు సంపాదించింది. ఈ సాంస్కృతిక ప్రదర్శనపై, ముఖ్యంగా మహిళలు తల వెంట్రుకలను వేగంగా కదిలించడంపై పలువురు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. ‘మహిళలు అలా తల వెంట్రుకలు ఎగరేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ఒకరు ప్రశ్నించగా, ‘ఈ హెయిర్ స్వింగింగ్ గురించి ఎవరైనా వివరిస్తారా? అని మరొకరు వ్యాఖ్యానించారు.

 ‘అల్ అయలా’ నృత్యం అంటే ఏమిటి?
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రకారం ‘అల్ అయలా’ అనేది ఒక సాంస్కృతిక ప్రదర్శన. ఇందులో కవిత్వ గానం, డ్రమ్ సంగీతం, నృత్యం ఉంటాయి. ఇది ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబిస్తుంది. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు ముందు వరుసలో నిలబడి తమ పొడవాటి జుట్టును అటూ ఇటూ వేగంగా కదిలిస్తారు. సుమారు ఇరవై మంది పురుషులు రెండు వరుసలలో ఎదురెదురుగా నిలబడి ఈటెలు లేదా కత్తులకు ప్రతీకగా సన్నని వెదురు కర్రలను పట్టుకుంటారు. ఈ నృత్యాన్ని సాధారణంగా ఒమన్, యూఏఈలలో వివాహాలు, పండుగల సందర్భాలలో ప్రదర్శిస్తారు. అన్ని వయసుల, సామాజిక వర్గాల వారు ఇందులో పాల్గొంటారు. ప్రధాన కళాకారుడి పాత్ర సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. ఇతరులకు శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా అతనిదే.

బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు
ఖతార్, సౌదీ అరేబియా పర్యటనల అనంతరం ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటనలో యూఏఈ చివరి మజిలీ. ఈ పర్యటనలో భాగంగా ఆయన వెళ్లిన ప్రతి గల్ఫ్ దేశంలోనూ అంగరంగ వైభవంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం సౌదీ అరేబియాలో ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి ఆరు ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్‌గా రాగా, ఖతార్‌లో కూడా ఫైటర్ విమానాలు ఆయన విమానానికి రక్షణగా వచ్చాయి. అంతేకాకుండా, ఆయన కాన్వాయ్‌కు డజన్ల కొద్దీ ఒంటెలు స్వాగతం పలికాయి. ఈ పర్యటన ద్వారా గల్ఫ్ దేశాల నుంచి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన హామీలను ట్రంప్ పొందారని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.


More Telugu News