నీర‌వ్ మోదీకి యూకే హైకోర్టులో షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌

  • పీఎన్‌బీకి రూ.13వేల కోట్ల‌కు పైగా ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి 
  • ఆయ‌న‌ తాజా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన‌ లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు 
  • ఈ మేర‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్ల‌డి
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు రూ. 13వేల కోట్ల‌కు పైగా ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టు గ‌ట్టి షాకిచ్చింది. ఆయ‌న‌ దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు కొట్టివేసింద‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తెలిపింది. 

లండన్‌కు వెళ్లిన సీబీఐ బృందం సహాయంతో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. బెయిల్ రాకుండా అడ్డుకుంది. కాగా, 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నిందితులలో ఒకరైన నీరవ్ మోదీని అప్పగింత వారెంట్‌పై అరెస్టు చేసిన యూకే అధికారులు 2019 మార్చి నుంచి జైలులోనే ఉంచారు.  

ఇక‌, పీఎన్‌బీ కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు,  2018 జనవరిలో నీరవ్ మోదీ భారత్‌ను వ‌దిలి పారిపోయారు. మొత్తం రూ.13,000 కోట్ల కుంభకోణంలో రూ.6498.20 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసంలో నీరవ్ మోదీ పాత్ర ఉందనే ఆరోపణలపై ఆయ‌న‌తో పాటు పారిపోయిన అతని మామ మెహుల్ చోక్సీని గత నెలలో బెల్జియంలో అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని చోక్సీ ఖండించారు.

కాగా, భార‌త్‌లో నీరవ్ మోదీపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో మోసం చేసినందుకు సీబీఐ కేసు, ఆ మోసం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేసిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ED) కేసు, అలాగే సీబీఐ విచారణలో ఆధారాలు, సాక్షులతో జోక్యం చేసుకున్నందుకు మ‌రో కేసు ఉంది.


More Telugu News