మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి!

  • మొయినాబాద్ భూకబ్జా కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన జీవన్ రెడ్డి
  • దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు షరతు
ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. మొయినాబాద్ ప్రాంతంలో ప్రైవేటు భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గతంలో ఇదే భూ వివాదానికి సంబంధించి జీవన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు ప్రక్రియకు సంపూర్ణంగా సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, జీవన్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, ఇదే కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే బెయిల్ లభించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం, జీవన్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, విచారణ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కల్పించరాదని స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తునకు సహకరించని పక్షంలో, సంబంధిత విచారణాధికారులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది.


More Telugu News