గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

  • టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌
  • భార‌త టెస్ట్ జట్టు త‌దుప‌రి కెప్టెన్‌పై చ‌ర్చ‌
  • శుభ్‌మ‌న్ గిల్‌కు టీమిండియా టెస్ట్ ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని వార్త‌లు
  • గిల్‌ ముందు జ‌ట్టులో కుదురుకొని, స్థానం సుస్థిరం చేసుకోవాల‌న్న శ్రీకాంత్ 
  • సార‌థిగా త‌న చాయిస్ మాత్రం జ‌స్ప్రీత్ బుమ్రానే అన్న మాజీ క్రికెట‌ర్‌
ఇటీవ‌ల టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ లాంగ్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు భార‌త టెస్ట్ జట్టు త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌కు టీమిండియా టెస్ట్ ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. 

ఈ విష‌య‌మై తాజాగా మాజీ క్రికెట‌ర్‌ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ స్పందించాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీమిండియాను న‌డిపించే స‌త్తా క‌లిగిన ఆట‌గాడు జ‌స్ప్రీత్ బుమ్రా మాత్ర‌మేన‌ని అన్నాడు. గిల్‌పై కెప్టెన్సీ భారం మోప‌కూడ‌ద‌ని కోరాడు. అత‌ని ఆట కూడా చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌న్నాడు. అత‌డు ముందు జ‌ట్టులో కుదురుకొని, స్థానం సుస్థిరం చేసుకోవాల‌ని సూచించాడు.   

త‌న దృష్టిలో గిల్ ప్ర‌స్తుత SENA (ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లోని ప‌రిస్థితులకు తగిన తుదిజ‌ట్టులో క‌చ్చితంగా లేడ‌ని తెలిపాడు. అదే స‌మ‌యంలో బుమ్రా వ‌ర్క్‌లోడ్ మీద వ్య‌క్త‌మ‌వుతున్న ఆందోళ‌న‌ల‌ను కూడా శ్రీకాంత్ తోసిపుచ్చాడు. రిష‌భ్ పంత్, కేఎల్ రాహుల్‌ల‌లో ఒక‌రికి వైస్ కెప్టెన్ ఇవ్వాల‌ని చెప్పాడు. అప్పుడు బుమ్రా ఆడ‌ని ఒక‌టి రెండు మ్యాచ్ ల‌లో వీళ్లు కెప్టెన్సీ బాధ్య‌త‌లు మోస్తార‌ని పేర్కొన్నాడు. 

"అంతా శుభ్‌మ‌న్ గిల్ టీమిండియా టెస్ట్ జ‌ట్టుకు కాబోయే సార‌థి అంటున్నారు. కానీ నా దృష్టిలో అత‌డికి తుది జ‌ట్టులోనే స్థానం ప‌దిలం కాదు. కేఎల్ రాహుల్‌, రిష‌భ్ పంత్ కు కెప్టెన్సీ ఇవ్వ‌కుంటే క‌చ్చితంగా జ‌స్ప్రీత్ బుమ్రాకు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించాలి. నేనే ఒక‌వేళ సెలక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ అయితే, త‌ప్ప‌కుండా బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేస్తా. 

'నీకు ఎన్ని మ్యాచ్‌లు వీలు ప‌డితే అన్ని గేమ్ లు ఆడు. మిగ‌తా బాధ్య‌త‌లు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ లేదా పంత్‌ చూసుకుంటారు' అని అత‌డితో చెబుతాను. ఎందుకంటే జ‌ట్టులో ఈ ఇద్ద‌రి స్థానం సుస్థిరం కాబ‌ట్టి. సెల‌క్ట‌ర్లు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియ‌దు. కానీ ఇదైతే నా ఎంపిక" అని కృష్ణ‌మాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.    


More Telugu News