ఆపరేషన్‌ సిందూర్‌: 11 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌

  • మృతుల్లో ఆరుగురు ఆర్మీకి చెందిన వారు
  • ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని వెల్ల‌డి
  • మరో 78 మంది గాయపడినట్లు ప్ర‌క‌టించిన పాక్‌
పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భార‌త్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో దాయాది పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన విష‌యం తెలిసిందే. భారత్‌ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సిందూర్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్‌ తాజాగా వెల్లడించింది.

భారత్ చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ద్వారా 11 మంది సైనికులు చ‌నిపోయినట్లు తాజాగా తెలిపింది. మృతుల్లో ఆరుగురు పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానిక దళానికి చెందిన వారని వెల్ల‌డించింది. అలాగే మరో 78 మంది గాయపడినట్లు పేర్కొంది. 

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు మ‌ర‌ణించ‌గా... 121 మంది గాయపడినట్లు తెలిపింది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్‌పీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మరణించిన సైనికుల పేర్లను కూడా పాక్‌ వెల్లడించింది. 

ఆర్మీకి చెందిన నాయక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, లాన్స్‌ నాయక్‌ దిలావర్‌ ఖాన్‌, లాన్స్‌ నాయక్‌ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయ్ ముహమ్మద్ అదీల్ అక్బర్, సిపాయ్ నిసార్ మరణించినట్లు తెలిపింది. 

అలాగే వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 

అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్‌ సైనికులు మృతిచెంది ఉంటారని భారత్‌ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. అలాగే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. 


More Telugu News